Precaution Dose: బూస్టర్‌ డోసుగా ఏ టీకాను ఇవ్వనున్నారు..?

మిక్సింగ్‌, మ్యాచింగ్‌ పద్ధతిలో మూడో డోసు ఉండదని.. కేవలం ఇదివరకు రెండు డోసుల్లో తీసుకున్న (కొవిషీల్డ్‌ లేదా కొవాగ్జిన్‌) వ్యాక్సిన్‌నే ప్రికాషన్‌ డోసుగా ఇవ్వనున్నట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడిస్తున్నాయి.

Updated : 27 Dec 2021 19:40 IST

కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఏం చెబుతున్నాయంటే

దిల్లీ: దేశవ్యాప్తంగా కొవిడ్‌ తీవ్రత మళ్లీ పెరుగుతోన్న వేళ ఇదివరకే రెండు డోసులు తీసుకున్న వారికి మూడో డోసు (ప్రికాషన్‌ డోసు) ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జనవరి 10వ తేదీ నుంచి తొలుత వీటిని ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు అందజేస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇదివరకు తీసుకున్న డోసునే బూస్టర్ డోసుగా ఇస్తారా లేక ఇతర వ్యాక్సిన్‌ను ఇస్తారా అనే విషయంపై కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. మిక్సింగ్‌, మ్యాచింగ్‌ పద్ధతిలో మూడో డోసు ఉండకపోవచ్చని.. కేవలం ఇదివరకు రెండు డోసుల్లో తీసుకున్న (కొవిషీల్డ్‌ లేదా కొవాగ్జిన్‌) వ్యాక్సిన్‌నే ప్రికాషన్‌ డోసుగా ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రెండో డోసు తీసుకున్న తర్వాత ఎన్ని నెలలకు ప్రికాషన్‌ డోసు ఇవ్వాలనేదే ముఖ్యమైన అంశమని కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. రెండో డోసు తీసుకున్న 9 నుంచి 12 నెలల విరామం తర్వాతే దీన్ని ఇచ్చే అంశాన్ని నిపుణుల బృందం పరిశీలిస్తోందని చెబుతున్నాయి. అయితే, కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ రెండు డోసుల మధ్య విరామ సమయం భిన్నంగా ఉన్నందున మూడో డోసుకు అదేవిధంగా ఉండవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. దీనిపై చర్చించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ నిపుణుల బృందం నేడు భేటీ కాగా.. త్వరలోనే బూస్టర్‌ డోసు, వ్యవధిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇలా బూస్టర్‌డోసు ఇచ్చే అంశంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇదివరకు తీసుకున్న వ్యాక్సిన్‌లు కాకుండా మిక్సింగ్‌, మ్యాచింగ్‌ పద్ధతిలో ఇతర వ్యాక్సిన్‌లను బూస్టర్‌గా ఇవ్వడం వల్ల సమర్థవంతంగా పనిచేస్తాయని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు ఒమిక్రాన్‌ వేరియంట్‌ను తటస్థీకరించేందుకు అవసరమైన యాంటీబాడీలను తమ బూస్టర్‌ డోసు వృద్ధి చేస్తోందని ఆస్ట్రాజెనెకా కూడా ఇటీవలే వెల్లడించింది. ఇలా బూస్టర్‌ డోసుపై భిన్న నివేదికలు, ఒక్కో రకమైన ఫలితాలు వినిపిస్తోన్న వేళ.. భారత్‌లో ఏ టీకాను ప్రికాషన్‌ డోసుగా ఇస్తారనే అంశం తెరమీదకు వచ్చింది. దీంతో ఇదివరకు తీసుకున్న వ్యాక్సిన్‌నే మూడో డోసుగా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని