Economic Crisis: సంక్షోభం వేళ.. కరెన్సీ నోట్లను ముద్రిస్తారా?

కరోనా వైరస్‌ మహమ్మారి వల్ల ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల నుంచి బయటపడేందుకు కరెన్సీ నోట్లను ముద్రించే ప్రణాళిక ప్రభుత్వానికి లేదని కేంద్రం స్పష్టం చేసింది.

Published : 26 Jul 2021 20:34 IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఏమన్నారంటే..!

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి వల్ల ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల నుంచి బయటపడేందుకు కరెన్సీ నోట్లను ముద్రించే ప్రణాళిక ప్రభుత్వానికి లేదని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు నోట్లను ముద్రించే యోచనలో ప్రభుత్వం ఉందా అని పార్లమెంటు సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ సమాధానం ఇచ్చారు. కరోనా మహమ్మారి విలయంతో ఏర్పడ్డ ప్రతికూల పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటును అందించడంతో పాటు ఉద్యోగాలను కాపాడడానికి కరెన్సీ నోట్లను ముద్రించాలని ఎంతోమంది ఆర్థికవేత్తలు, నిపుణులు సూచిస్తోన్న సయమంలో ప్రభుత్వం ఈ క్లారిటీ ఇచ్చింది.

2020-21 మధ్యకాలంలో భారత జీడీపీ 7.3శాతానికి క్షీణించిందని అంచనా వేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ ఫలితాలు కరోనా వైరస్‌ కట్టడికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. లాక్‌డౌన్‌లు ముగిసిపోవడంతో ఆర్థికవ్యవస్థ తిరిగి గాడిలో పడుతోందని అభిప్రాయపడ్డారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ మిషన్ సహకారంతో 2020-21 ద్వితియార్ధం నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఇందులోభాగంగా ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కల్పించడంతో పాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరచేందుకు ఆత్మనిర్భర్‌ భారత్‌ (ANB) కింద దాదాపు రూ.29.87లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని నిర్మలా సీతారామన్‌ గుర్తు చేశారు.

ఇదిలాఉంటే, ప్రతిపక్ష పార్టీల ఆందోళనలతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు అట్టుడుకుతున్నాయి. ముఖ్యంగా పెగాసస్‌ స్పైవేర్‌ ఉదంతంపై చర్చ జరపాలని డిమాండ్‌ చేస్తోన్న ప్రతిపక్ష పార్టీలు సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హోంశాఖ మంత్రి అమిత్‌ షా లోక్‌సభ స్పీకర్‌తో భేటీ కాగా.. ప్రతిపక్ష పార్టీల నేతలతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ సమావేశమయ్యారు. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రతిపక్ష పార్టీలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని