Booster dose: క్లినికల్‌ ట్రయల్స్‌ లేకుండా బూస్టర్‌ డోసును సిఫార్సు చేయలేం: ఎస్‌ఈసీ

క్లినికల్‌ ట్రయల్స్‌ జరగకుండా బూస్టర్‌ డోసును సిఫార్సు చేయలేమని బూస్టర్‌ డోసు ప్రయోగాల సబ్జెక్టు నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ) స్పష్టం చేసింది......

Published : 11 Dec 2021 22:47 IST

దిల్లీ: కరోనా మహమ్మారి భయం ప్రజలను పట్టి పీడిస్తోంది. దేశంలో కొద్దికాలంపాటు డెల్టా వేరియంట్‌ విజృంభించగా.. తాజాగా ఒమిక్రాన్‌ భయపెడుతోంది. ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటంతో మూడో వేవ్‌ వచ్చే అవకాశాలున్నాయని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా కొత్త కేసులను అరికట్టేందుకు బూస్టర్‌ డోసులు ఇవ్వాలనే డిమాండ్‌ సైతం వినిపిస్తోంది. కొవిషీల్డ్‌ను బూస్టర్‌ డోసుగా ఇచ్చేందుకు అనుమతించాలని టీకా తయారీ సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా  డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కి దరఖాస్తు కూడా చేసింది. ఈ నేపథ్యంలోనే ‘కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ’ (సీడీఎస్‌సీవో) ఆధ్వర్యంలోని బూస్టర్‌ డోసు ప్రయోగాల సబ్జెక్టు నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ) తాజాగా స్పందించింది. క్లినికల్‌ ట్రయల్స్‌ జరగకుండా బూస్టర్‌ డోసును సిఫార్సు చేయలేమని స్పష్టం చేసింది. బూస్టర్ డోస్ కోసం సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చేసుకున్న దరఖాస్తును సమీక్షించింది. మరింత అదనపు సమాచారం కావాలని ఆ సంస్థను కోరింది.

దేశంలో ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో కొవిషీల్డ్‌ను బూస్టర్‌ డోసుగా ఇచ్చేందుకు అనుమతించాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌ డీసీజీఐకి ఈ నెల ప్రారంభంలో దరఖాస్తు చేసింది. దీని మాతృక టీకా అయిన ఆస్ట్రాజెనెకాను బ్రిటన్‌ ప్రభుత్వం బూస్టర్‌ డోసుగా గుర్తించిందని సీఐఐలో ప్రభుత్వం తరఫున డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ప్రకాశ్‌ కుమార్‌ సింగ్‌ చెప్పారు. కరోనాలో కొత్త ఉత్పరివర్తనాలు వస్తున్నందున బూస్టర్‌ డోసులు ఇవ్వాలన్న వినతులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. దేశంలో కొవిషీల్డ్‌ టీకాకు కొరత లేదని, రెండు డోసులు తీసుకున్నవారికి బూస్టర్‌ డోసు ఇవ్వాలన్న డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో తమ వినతిని పరిశీలించాలని ఆ సంస్థ కోరింది. చాలా దేశాల్లో ఇప్పటికే బూస్టర్‌ డోసులను ఇస్తున్నాయని గుర్తుచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని