Omicron: ఒమిక్రాన్‌తో ఒక్క మరణం కూడా లేదు: WHO

అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు భావిస్తోన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌పై ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణంగా ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

Published : 03 Dec 2021 21:21 IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి

జెనీవా: అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు భావిస్తోన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌పై ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణంగా ఇప్పటివరకూ ఏ ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. చాలా దేశాల్లో ఇప్పటికే కొత్త వేరియంట్‌ విస్తరించినప్పటికీ.. ఒమిక్రాన్‌తో మరణం సంభవించినట్లు ఏ దేశంలోనూ నమోదు కాలేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ వేరియంట్‌ను ఆందోళకర రకంగా ప్రకటించిన డబ్ల్యూహెచ్‌వో.. వైరస్‌ తీవ్రతకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నట్లు పేర్కొంది.

‘వేగంగా విస్తరిస్తోన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పటికే చాలా దేశాలకు వ్యాపించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రపంచ దేశాలు.. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు ముమ్మరం చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఈ వేరియంట్‌ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. వైరస్‌ తీవ్రతకు సంబంధించిన అదనపు సమాచారం వస్తుంది. ఈ సమయంలో కొన్నిచోట్ల మరణాలకు సంబంధించిన సమాచారం కూడా రావచ్చు’ అని డబ్ల్యూహెచ్‌ఓ అధికార ప్రతినిధి క్రిస్టియన్‌ లిండ్‌మెయిర్‌ వెల్లడించారు. అయితే, ఇప్పటివరకు ఏ దేశంలోనూ ఈ వేరియంట్‌ వల్ల మరణం నమోదు కాలేదని చెప్పారు. ఈ వేరియంట్‌ సంక్రమణ, తీవ్రత, వ్యాక్సిన్‌ల సామర్థ్యానికి సంబంధించి ఓ నిర్ధారణకు రావాలంటే మరికొన్ని వారాలు పడుతుందన్నారు. ఇప్పటివరకు వచ్చిన ప్రాథమిక సమాచారం బట్టి ఒమిక్రాన్‌ వేరియంట్‌కు సంక్రమణ సామర్థ్యం అధికంగా ఉందని మాత్రమే రుజువైందని క్రిస్టియన్‌ లిండ్‌మెయిర్‌ పేర్కొన్నారు.

ఇక రానున్న రోజుల్లో ఒమిక్రాన్‌ ప్రాబల్యం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా డెల్టా ప్రాబల్యమే అధికంగా ఉందని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. ఈ నేపథ్యంలో డెల్టా వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు అనుసరించిన విధంగానే ఒమిక్రాన్‌కు అడ్డుకట్ట వేసేందుకు కట్టడి చర్యలు అమలు చేయాలని ప్రపంచ దేశాలకు సూచించింది. ఇదిలాఉంటే, వేగంగా వ్యాప్తి చెందుతోన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పటికే 30 దేశాలకుపైగా వ్యాపించినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని