Assam-Mizoram Border: అంగుళం భూమిని కూడా పోనివ్వం 

అస్సాం భూభాగాన్ని కాపాడుకునేందుకు తాము కట్టుబడి ఉన్నామని, అంగుళం భూమిని కూడా ఎవరికీ వదులుకునేది లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. అస్సాం

Published : 27 Jul 2021 23:44 IST

సరిహద్దు వివాదంపై అస్సాం సీఎం హిమంత 

గువాహటి: అస్సాం భూభాగాన్ని కాపాడుకునేందుకు తాము కట్టుబడి ఉన్నామని, అంగుళం భూమిని కూడా ఎవరికీ వదులుకునేది లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. అస్సాం - మిజోరం సరిహద్దుల్లో సోమవారం జరిగిన ఘర్షణల్లో అస్సాంకు చెందిన ఐదుగురు పోలీసులు, ఓ పౌరుడు మృతిచెందగా.. 60 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. దీంతో సీఎం హిమంత నేడు సిల్చార్‌లో పర్యటించారు. ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు నివాళులర్పించిన ఆయన.. క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మిజోరంకు గట్టి హెచ్చరికలు చేశారు. 

‘‘ఇది రాజకీయ వివాదం కాదు. రెండు రాష్ట్రాల మధ్య చాలా ఏళ్లుగా సరిహద్దు వివాదం నడుస్తోంది. నిన్న సరిహద్దుల్లో ఘర్షణలు జరుగుతున్నాయని తెలియగానే నేను మిజోరం ముఖ్యమంత్రికి ఆరు సార్లు ఫోన్‌ చేశా. కానీ ఆయన కల్పించుకోలేదు సరికదా.. చర్చలకు రమ్మని చెప్పారు. ఇలాంటి సమస్యలు పరిష్కారమైతే అభివృద్ధి జరుగుతుంది. అయితే మా సరిహద్దులను రక్షించుకునేందుకు మేం కట్టుబడి ఉన్నాం. అస్సాం నుంచి అంగుళం భూమిని కూడా ఎవరికీ వదులుకోం. సరిహద్దుల్లో నిరంతరం విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు ఒక నెల జీతం అదనంగా ఇవ్వనున్నాం’’ అని హిమంత చెప్పుకొచ్చారు. 

ఇక అస్సాం, మిజోరం మధ్య రిజర్వ్‌ అటవీ ప్రాంతం ఉందని, అయితే కొందరు వీటిని ఆక్రమిస్తున్నారంటూ మిజోరంపై పరోక్ష విమర్శలు చేశారు. అక్కడ కొందరు సెటిల్మెంట్లు చేస్తున్నారని దుయ్యబట్టారు. దీనిపై తాము సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. అప్పుడే రిజర్వ్‌ అటవీ ప్రాంతాల్లో ఆక్రమణలు ఆగుతాయని అన్నారు. 

మృతుల కుటుంబాలకు పరిహారం..

ఈ సందర్భంగా ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబాలకు సీఎం హిమంత రూ. 50లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.లక్ష ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపారు. అంతేగాక, ఘటనపై దర్యాప్తు చేయనున్నట్లు చెప్పారు. పౌరులకు ఆయుధాలు ఎక్కడనుంచి వచ్చాయన్న దానిపై లోతుగా విచారణ చేపడతామన్నారు. ఇదిలా ఉండగా.. పోలీసుల మృతికి నివాళిగా మూడు రోజుల పాటు అస్సాం ప్రభుత్వం సంతాపదినాలుగా ప్రకటించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని