Omicron: ఆ విషయాలపై ఇంకా స్పష్టత లేదు: డబ్ల్యూహెచ్‌ఓ

డెల్టా సహా ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందా? లేదా మరింత తీవ్రమైన వ్యాధికి కారణమవుతుందా?....

Updated : 29 Nov 2021 13:31 IST

జెనీవా(ఐరాస): కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ యావత్తు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) కీలక ప్రకటన చేసింది. డెల్టా సహా ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందా? లేదా మరింత తీవ్రమైన వ్యాధికి కారణమవుతుందా? అనే విషయాలపై ‘‘ఇంకా స్పష్టంగా తెలియదు’’ అని పేర్కొంది. అలాగే ఈ వేరియంట్‌ వల్ల ఎలాంటి భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నాయనే దానిపై కూడా ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదని తెలిపింది.

అక్కడ కేసులు పెరుగుతున్నాయ్‌.. కానీ,

దక్షిణాఫ్రికా సహా ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్‌పై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. వివరాలు అందుబాటులోకి వస్తున్న కొద్దీ వాటిని ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తామని తెలిపింది. దక్షిణాఫ్రికాలో ఈ వేరియంట్‌ వెలుగులోకి వచ్చిన ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరిగిందని పేర్కొంది. అయితే, అవి ఒమిక్రాన్‌ వల్లేనని ఇంకా నిర్ధారణ కాలేదని తెలిపింది. దీనిపై అధ్యయనాలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. అలాగే దక్షిణాఫ్రికాలో ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోందని తెలిపింది. అయితే, ఇది కొత్త వేరియంట్‌ వల్లేనని చెప్పడానికి నిర్దిస్ట ఆధారాలు లేవని పేర్కొంది.

ఆ ఫలితమే ఒమిక్రాన్‌...

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రబలరూపంగా మారిన డెల్టా సహా అన్ని కొవిడ్‌ వేరియంట్లు ప్రమాదకరమైనవేనని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. నివారణ ఒకటే మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి మార్గమని తెలిపింది. మరోవైపు వ్యాక్సిన్ల పంపిణీలో జరుగుతున్న అన్యాయం ఇంకా కొనసాగుతున్న ఫలితమే ఒమిక్రాన్‌ అని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రెస్‌ అధనామ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ల పంపిణీలో సమానత్వం లోపిస్తున్న కొద్దీ  వైరస్‌ మరిన్ని పరివర్తనాలకు లోనవుతుందని.. తద్వారా మరింత ముప్పు తెచ్చిపెడుతుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వైద్యులు, ఆరోగ్య సంరక్షులు సహా ఇతర కరోనా యోధులకు తొలుత వ్యాక్సిన్‌ అందించాల్సిన అవసరం ఉందన్నారు.

మరిన్ని దేశాల్లో..

తొలుత దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ వేరియంట్‌ జాడలు క్రమంగా ఇతర దేశాలకూ విస్తరిస్తున్నాయి. బ్రిటన్‌, జర్మనీ, ఇటలీ, బెల్జియం, ఇజ్రాయెల్‌, హాంకాంగ్‌, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌, దేశాల్లో ఈ వేరియంట్‌ బయటపడింది. దీంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. బ్రిటన్‌ సహా పలు దేశాలు మాస్కులు వంటి నిబంధనలను కట్టుదిట్టం చేశాయి. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని