Novavax: ఇన్‌ఫ్లూయెంజా, కొవిడ్‌ టీకాల మిశ్రమ ప్రయోగాలు!

ఇన్‌ఫ్లూయెంజా టీకాలతో పాటు కొవిడ్‌ వ్యాక్సిన్‌ను కలిపి పరీక్షించేందుకు నొవావాక్స్‌ నడుం బిగించింది. ఈ ప్రయోగాలను తొలుత ఆస్ట్రేలియాలో చేపడుతున్నట్లు నొవావాక్స్‌ వెల్లడించింది.

Published : 08 Sep 2021 22:30 IST

సమర్థ వ్యాక్సిన్‌లే లక్ష్యంగా ప్రయోగాలన్న నొవావాక్స్‌

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ మహమ్మారి సమర్థంగా తిప్పికొట్టే టీకాల కోసం కృషి జరుగుతూనే ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లపైనా ప్రయోగాలు చేసేందుకు తయారీ సంస్థలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇన్‌ఫ్లూయెంజా టీకాలతో పాటు కొవిడ్‌ వ్యాక్సిన్‌ను కలిపి పరీక్షించేందుకు నొవావాక్స్‌ నడుం బిగించింది. ఈ ప్రయోగాలను తొలుత ఆస్ట్రేలియాలో చేపడుతున్నట్లు నొవావాక్స్‌ వెల్లడించింది.

నొవావాక్స్‌ తయారుచేసిన ఇన్‌ఫ్లూయెంజా టీకా నానోఫ్లూతో పాటు కొవిడ్‌ టీకా NVX-Cov2373 కలిపి పరీక్షించాలని యోచిస్తోంది. ఇందుకోసం ఆస్ట్రేలియాలో దాదాపు 640మందిని ఎంపిక చేసుకుంటున్నట్లు పేర్కొంది. ఇదివరకే కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురైన వారు లేదా వ్యాక్సిన్‌ తీసుకున్న వారిపై ఈ ప్రయోగాలు చేస్తామని తెలిపింది. అధ్యయనానికి కనీసం ఎనిమిది వారాలకు ముందు వైరస్‌కు గురికావడమో లేదా టీకా తీసుకున్న వారినే ఎంచుకుంటామని నొవావాక్స్‌ వెల్లడించింది.

‘ఈ రెండు వ్యాక్సిన్ల కలయికతో ఆరోగ్య రక్షణ వ్యవస్థలో అధిక సామర్థ్యం కలిగిన టీకా అందుబాటులోకి రావచ్చు. ఒకే ఆయుధంతో ఇన్‌ఫ్లూయెంజాతో పాటు కొవిడ్‌ను ఎదుర్కొనే రక్షణను అధికంగా పొందవచ్చు’ అని నొవావాక్స్‌ ఆర్‌&డీ విభాగాధిపతి గ్రెగొరీ గ్లెన్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా కొత్తగా పుట్టుకొచ్చే వేరియంట్లపైనా ఇవి సమర్థంగా పనిచేసే అవకాశం ఉందని ఇదివరకే చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. వీటి ఫలితాలు వచ్చే ఏడాది ప్రథమార్థంలో వెలుబడే అవకాశాలున్నట్లు నొవావాక్స్‌ అంచనా వేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని