Additional Dose: అదనపు డోసు.. డిసెంబర్‌ 6న నిపుణుల కమిటీ భేటీ!

భారత్‌లో మూడో డోసు ఇచ్చే అంశంపై కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని నిపుణులు కమిటీ సంప్రదింపులు జరుపుతోంది. ఇందులో భాగంగా నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌ (NTAGI) సోమవారం నాడు మరోసారి సమావేశం కానుంది.

Published : 06 Dec 2021 01:26 IST

దిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ వేగంగా కొనసాగుతోంది. ఇదే సమయంలో వేగంగా విస్తరిస్తున్న కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య పెరగడం కూడా ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో మూడో డోసు ఇచ్చే అంశంపై కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని నిపుణులు కమిటీ సంప్రదింపులు జరుపుతోంది. ఇందులో భాగంగా నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌ (NTAGI) సోమవారం నాడు మరోసారి సమావేశం కానుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే బాధితులకు అదనపు డోసు అందించే అంశమే ప్రధాన అజెండాగా ఉన్నట్లు సమాచారం.

కొత్త వేరియంట్‌ పుట్టుకొస్తున్న వేళ.. దేశంలో బూస్టర్‌ డోసు పంపిణీపై పరిశీలన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని పలు రాష్ట్రాలు కోరుతున్నాయి. అంతేకాకుండా కొత్త వేరియంట్లను ఎదుర్కొనేందుకు బూస్టర్‌ డోసు ఇవ్వడమే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే సీరం ఇన్‌స్టిట్యూట్‌ కూడా కొవిషీల్డ్‌ను బూస్టర్‌గా గుర్తించాలని ఔషధ నియంత్రణ సంస్థకు దరఖాస్తు చేసుకుంది. ఇలా బూస్టర్‌ డోసుపై డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర నిపుణుల బృందం మాత్రం బూస్టర్‌ డోసు వైపు కాకుండా అదనపు డోసుపై దృష్టి పెట్టామని చెబుతోంది. బూస్టర్‌, అదనపు డోసు వేర్వేరుగా పేర్కొన్న నిపుణుల బృందం.. రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా వైరస్‌ నుంచి ఎటువంటి రక్షణ కలగని వారికి ఇచ్చే మూడో డోసును ‘అదనపు డోసు’గా పరిగణిస్తామని పేర్కొంది. ఇక రెండు డోసులు తీసుకున్న కొంతకాలానికి రోగనిరోధక స్పందనలు తగ్గితే.. అటువంటి వారికి ఇచ్చే మరికొంత వ్యవధి తర్వాత ఇచ్చే డోసును బూస్టర్‌ డోసుగా పరిగణిస్తామని వెల్లడించింది.

మూడో డోసుపై దేశవ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో అసలు బూస్టర్‌ డోసు ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో భాగంగా నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌ (NTAGI), నేషనల్‌ ఎక్స్‌పర్ట్‌ గ్రూప్‌ ఆన్‌ వ్యాక్సిన్‌ అడ్మినిస్ట్రేషన్‌లు (NEGVAC) బూస్టర్‌ డోసు ఇవ్వాల్సిన శాస్త్రీయ సాక్ష్యాధారాలు, అవసరంపై చర్చలు జరుపుతున్నాయి. ఇందులో భాగంగానే డిసెంబర్‌ 6వ తేదీన టీకాలపై సలహా బృందం సమావేశం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని