OBC, EWS Quota in Medicine: వైద్య కోర్సుల్లో రిజర్వేషన్లు ఖరారు!

వైద్య కోర్సుల్లో రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం ఖారారు చేసింది. ఓబీసీ-27శాతం, ఈడబ్ల్యూఎస్‌-10 శాతం రిజర్వేషన్‌ అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Updated : 29 Jul 2021 16:48 IST

వెల్లడించిన కేంద్ర ఆరోగ్యశాఖ

దిల్లీ: వైద్య కోర్సుల్లో రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఓబీసీ-27శాతం, ఈడబ్ల్యూఎస్‌-10 శాతం రిజర్వేషన్‌ అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ రిజర్వేషన్లు యూజీ (ఎంబీబీఎస్‌, బీడీఎస్‌), పీజీ, దంత వైద్యవిద్య కోర్సులకు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ విద్యా సంవత్సరం (2021-22) నుంచే ఇవి అమలులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జాతీయస్థాయి కోటా విభాగంలో ఈ రిజర్వేషన్లను అమలు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ద్వారా ఎంబీబీఎస్‌లో ప్రతి ఏడాది 1500 విద్యార్థులు, పీజీలో 2500 మంది ఓబీసీ విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా EWS విభాగంలో 550 ఎంబీబీఎస్‌ విద్యార్థులు, పీజీలో వెయ్యి మందికి అవకాశం లభిస్తుందని పేర్కొంది.

ప్రధానమంత్రి మోదీ హర్షం..

వెనుకబడిన వర్గాలకు వైద్య విద్య (Medicine)లో రిజర్వేషన్లు కల్పిస్తూ తమ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రస్తుత ఏడాది నుంచే ఓబీసీలకు 27శాతం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (EWS) 10శాతం రిజర్వేషన్‌లు అమలులోకి వస్తాయని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. తాజా నిర్ణయంతో ప్రతి ఏడాది వేల మంది యువతీ యువకులకు కొత్తగా అవకాశాలు లభించడంతో పాటు దేశంలో సామాజిక న్యాయం కొత్తరూపు సంతరించుకోవడానికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.

ఇదిలాఉంటే, ప్రతిభ కలిగిన విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఉన్న మెడికల్ కాలేజీల్లో వైద్య విద్యను అభ్యసించేందుకు వీలుగా 1986లో జాతీయ స్థాయిలో రిజర్వేషన్‌ కోటాపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ, 2007 వరకూ ఆల్‌ఇండియా కోటా కింద ఎటువంటి రిజర్వేషన్లు అమలు కాలేదు. 2007 తర్వాత వైద్య విద్యలో ఎస్పీలకు 15శాతం, ఎస్టీ ఆశావాహులకు 7.5శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర నిర్ణయంతో ఇతర వర్గాల వారికీ ప్రయోజనం చేకూరనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు