
Corona Virus: ఎయిడ్స్‌పై పోరుకు కొవిడ్‌తో బ్రేకులు: ఫౌచీ
ఐరాస: కొవిడ్ కట్టడికి గాను భారీగా పరిశోధకులను, ఆర్థిక వనరులను మళ్లించాల్సి రావడంతో 2030 కల్లా ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలించాలన్న ఐక్యరాజ్య సమితి (ఐరాస) లక్ష్యానికి విఘాతం ఏర్పడిందని అమెరికా అధ్యక్షుడికి వైద్య వ్యవహారాల ప్రధాన సలహాదారు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు. అయితే హెచ్ఐవీ-ఎయిడ్స్ నిర్మూలనకు శాస్త్రవేత్తలు, వైద్యులు జరిపిన సుదీర్ఘ కృషి కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి తోడ్పడుతోందని వెల్లడించారు. ఎయిడ్స్ చికిత్సకు మందుల రూపకల్పనలోను, మోనోక్లోనల్ యాంటీబాడీల ప్రయోగంలోను గడించిన అనుభవం కొవిడ్‌పై పోరుకు అక్కరకొస్తోందన్నారు. కొవిడ్ నిరోధానికి రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాల్లో తగు మార్పుచేర్పులు చేసి ఎయిడ్స్ నిర్మూలనకు ప్రయోగించే విషయమై పరిశోధనలు సాగుతున్నాయని ఫౌచీ చెప్పారు. కొవిడ్‌పై పోరు నుంచి నేర్చే పాఠాలు ఎయిడ్స్‌పై పోరుకు ఉపయోగపడతాయన్నారు. ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలన దినం సందర్భంగా ఐరాస సర్వసభ్య సమావేశానికి ఆయన బుధవారం ఆడియో ప్రసంగాన్ని పంపారు. కొవిడ్ వల్ల సరఫరా వ్యవస్థ విచ్ఛిన్నమై మందుల ఉత్పత్తి, పంపిణీ దెబ్బతినడం వల్ల ఎయిడ్స్ చికిత్సకు ఆటంకం కలిగిందని ఫౌచీ వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.