West Bengal: 7 ఏళ్ల బాలుడిలో ఒమిక్రాన్‌ నిర్ధారణ..!

బుధవారం భారత్‌లో నమోదైన కేసుల్లో ఓ ఏడేళ్ల బాలుడికి ఈ వేరియంట్‌ నిర్ధారణ అయ్యింది. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌కు చెందిన బాలుడిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ గుర్తించినట్లు అక్కడి ఆరోగ్యశాఖ ప్రకటించింది.

Published : 16 Dec 2021 01:22 IST

పశ్చిమబెంగాల్‌ తొలికేసు నమోదు

కోల్‌కతా: ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. మనదేశంలోనూ ఇప్పటివరకు 65 ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూశాయి. అయితే, బుధవారం భారత్‌లో నమోదైన కేసుల్లో ఓ ఏడేళ్ల బాలుడికి ఈ వేరియంట్‌ నిర్ధారణ అయింది. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌కు చెందిన బాలుడిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ గుర్తించినట్లు అక్కడి ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వెల్లడించిన ప్రభుత్వం.. రాష్ట్రంలో నమోదైన మొదటి ఒమిక్రాన్‌ కేసు కూడా ఇదేనని తెలిపింది. అయితే, చిన్నారుల్లోనూ ఈ వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తుందనే అనుమానాల నేపథ్యంలో తాజాగా ఏడేళ్ల బాలుడిలో వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది.

ముర్షిదాబాద్‌కు చెందిన ఓ జంట.. వారి ఏడేళ్ల కుమారుడితో కలిసి ఈ నెల 10న అబుదాబీ నుంచి భారత్ చేరుకున్నారు. తొలుతవారు హైదరాబాద్‌ విమానాశ్రయంలో దిగి.. అక్కడ నుంచి పశ్చిమబెంగాల్‌ వెళ్లిపోయారు. అదే సమయంలో హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు అధికారులు వారికి కొవిడ్‌ నిర్ధారణ (RTPCR) పరీక్షలు జరిపారు. అందులో తల్లిదండ్రులకు నెగటివ్‌ రాగా.. ఏడేళ్ల బాలుడికి మాత్రం కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ నమూనాలను జోనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించగా ఒమిక్రాన్‌ నిర్ధారణ అయినట్లు బుధవారం వెల్లడైంది. ప్రస్తుతం బాలుడు ముర్షిదాబాద్‌ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు బెంగాల్‌ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

ఇక తెలంగాణలోనూ రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బాలుడికి తెలంగాణలో జరిపిన కొవిడ్‌ పరీక్షల్లోనే ఒమిక్రాన్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే, అతను రాష్ట్రంలోకి ప్రవేశించలేదని తెలంగాణ ఆరోగ్యశాఖ వెల్లడించింది. బాలుడు కుటుంబంతో కలిసి విదేశాల నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చి.. అక్కడి నుంచి దేశీయ విమానంలో పశ్చిమ బెంగాల్‌కు వెళ్లినట్లు తెలిపింది. బాలుడు వెళ్లే ముందు ఇచ్చిన శాంపిల్‌ను పరిశీలించగా అతడికి ఒమిక్రాన్‌ సోకినట్లు తేలిందని.. ఈ సమాచారాన్ని బెంగాల్‌ ఆరోగ్యశాఖ అధికారులకు చేరవేసినట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని