Omicron: ఒమిక్రాన్‌ను.. సహజ వ్యాక్సిన్‌ అనుకోవడం ప్రమాదకరమే..!

ఒమిక్రాన్ వేరియంట్‌ సహజ వ్యాక్సిన్‌గా దోహదం చేస్తుందని కొందరు భావిస్తున్న తరుణంలో.. అటువంటి ఆలోచన ప్రమాదకరమైందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Published : 03 Jan 2022 01:23 IST

ఒమిక్రాన్‌పై ఆరోగ్య నిపుణుల హెచ్చరిక

దిల్లీ: యావత్‌ ప్రపంచాన్ని ఒమిక్రాన్‌ వేరియంట్‌ వణికిస్తున్నప్పటికీ దాని వల్ల వ్యాధి తీవ్రత, ఆస్పత్రి ముప్పు తక్కువేనని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో ఒమిక్రాన్ వేరియంట్‌ సహజ వ్యాక్సిన్‌గా దోహదం చేస్తుందని కొందరు భావిస్తున్నారు. అయితే, ఒమిక్రాన్‌ వేరియంట్‌ నేచురల్‌ వ్యాక్సిన్‌గా పనిచేస్తుందనే ఆలోచన ప్రమాదకరమైందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘ కొవిడ్‌ (Long Covid) పర్యవసానాలపై స్పష్టత లేనందున అటువంటి ఆలోచన మంచిది కాదన్నారు.

సహజ వ్యాక్సిన్‌గా ఒమిక్రాన్‌ పనిచేస్తుందని వస్తోన్న వార్తలను ప్రముఖ వైరాలజిస్ట్‌, ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం (INSACOG) మాజీ చీఫ్‌ డాక్టర్‌ షాహిద్‌ జమీల్‌ తోసిపుచ్చారు. ఇలా భావించడం అత్యంత ప్రమాదకరమన్న ఆయన.. కొందరు బాధ్యతారహితమైన ప్రజలు ఇటువంటి వాటిని వ్యాప్తి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. లాంగ్‌ కొవిడ్‌ను పరిగణనలోకి తీసుకోని వారే ఇటువంటివి ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇలాంటివి ప్రజల్లో ఆత్మసంతృప్తిని పెంపొందించడమే కాకుండా వైరస్‌ కట్టడిలో నిర్లక్ష్యాన్ని మరింత పెంచుతాయని హెచ్చరించారు. ముఖ్యంగా పోషకాహారలోపం, వాయు కాలుష్యం, మధుమేహం వంటి సమస్యలు ఎక్కువగా ఉన్న భారత్‌లో వైరస్‌కు ప్రభావితం అవడం మంచిదికాదన్నారు.

‘ఈ వేరియంట్‌ వల్ల ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు చోటుచేసుకుంటున్నాయి. అసత్య ప్రచారాలకు దూరంగా ఉండండి. ఇతర వేరియంట్‌లనుంచి వ్యాక్సిన్‌ కంటే సహజంగా వైరస్‌ బారినపడడం వల్ల ఆశించిన రక్షణ లభించదు. ఒమిక్రాన్‌ తీవ్రత స్వల్పంగానే కనిపిస్తున్నప్పటికీ ఇది వ్యాక్సిన్‌ కాదు’ అని ప్రముఖ ఎపిడమాలజిస్ట్‌ ప్రొఫెసర్‌ గిరిధర బాబు పేర్కొన్నారు.

వైరస్‌ సోకడం వల్ల దీర్ఘకాల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయని ఉజాలా సిగ్నస్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఆస్పటల్స్‌ వ్యవస్థాపకుడు శుచిన్‌ బజాజ్‌ పేర్కొన్నారు. ఆర్నెళ్ల తర్వాత కూడా కొందరిలో ఊపిరితిత్తులు, గుండె, బ్రెయిన్‌, కిడ్నీలకు సంబంధించి దుష్ర్పభావాలు కనిపిస్తున్నాయి. లాంగ్‌ కొవిడ్‌కు సంబంధించి ఎలాంటి ప్రభావాలు ఉంటాయనే విషయంపై కచ్చితంగా చెప్పలేకపోతున్నాం. అందుకే దీన్ని వ్యాక్సిన్‌గా పరిగణించలేం. ఇది వైరస్‌ మాత్రమేనని.. దీంతో జాగ్రత్తగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.

డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి మూడు, నాలుగు రెట్లు అధికంగా ఉన్నట్లు అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, లక్షణాలు, ఆస్పత్రి చేరికలు, మరణాలు మాత్రం తక్కువగానే ఉంటున్నట్లు నివేదికలను బట్టి తెలుస్తోంది. దీంతో ఒమిక్రాన్‌ వేరియంట్‌ సహజ వ్యాక్సిన్‌ మాదిరిగా పనిచేస్తుందనే భావనను కొందరు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర వైద్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా కొవిడ్‌ మహమ్మారి ఎండమిక్‌ (స్థానికంగా వ్యాప్తి చెందే) స్థాయికి చేరుకుంటుందని వారు అంచనా వేసి చెప్పడాన్ని వైద్యనిపుణులు వ్యతిరేకిస్తున్నారు. ఇదిలాఉంటే, వ్యాక్సినేషన్‌తోపాటు నేచురల్‌ ఇన్‌ఫెక్షన్‌ నుంచి కొవిడ్‌ను ఎదుర్కొనే హైబ్రిడ్‌ ఇమ్యూనిటీ వృద్ధి చెందుతుందని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ ఇటీవలే పేర్కొనడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని