Omicron scare: ఒమిక్రాన్‌ కలవరం.. టెస్టుల సంఖ్య మరింత పెంచండి!

దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఇందులో భాగంగా కేంద్ర ఆరోగ్యశాఖ నేడు అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో మరోసారి సమావేశం నిర్వహించింది.

Updated : 30 Nov 2021 16:37 IST

రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ సూచన

దిల్లీ: దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా కేంద్ర ఆరోగ్యశాఖ నేడు అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో మరోసారి సమావేశం నిర్వహించింది. ముఖ్యంగా కొత్త వేరియంట్‌ను గుర్తించేందుకు నిర్ధారణ పరీక్షలను మరింత ముమ్మరం చేయాలని సూచించింది. ఇదే సమయంలో ఆర్‌టీ-పీసీఆర్‌, ఆర్‌ఏటీ పరీక్షల నుంచి ఈ వేరియంట్‌ తప్పించుకోలేదని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

దేశంలో ఒమిక్రాన్‌ భయాలు నెలకొన్న వేళ.. అన్ని రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ నేడు మరోసారి సమావేశమయ్యారు. ఇప్పటివరకు దేశంలో ఈ కొత్త వేరియంట్‌ వెలుగు చూడలేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ అవసరమైన స్థాయిలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు, హోమ్‌ ఐసోలేషన్‌ ఏర్పాట్లు చేసుకోవాలని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు. ఆందోళనకర కొత్త వేరియంట్‌తో భారత్‌కు మరోసారి ముప్పు పొంచి వున్న నేపథ్యంలో సమర్థవంతమైన కట్టడి చర్యలు, క్రియాశీల పర్యవేక్షణ, పరీక్షల పెంపు, హాట్‌స్పాట్‌ల గుర్తింపు, ముమ్మర వ్యాక్సినేషన్‌, ఆరోగ్య మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచుకోవడం వంటి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

ఇప్పటికే పలు దేశాలకు ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తించిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ రెండు రోజుల క్రితమే అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ రాసింది. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణికులపై గట్టి నిఘా ఉంచాలని సూచించింది. ఒమిక్రాన్‌ విస్తరించిన దేశాలను ‘అధిక రిస్క్‌’ దేశాల జాబితాలో చేర్చిన కేంద్రం.. అక్కడ నుంచి వచ్చే వారికి పరీక్షలు ముమ్మరం చేయాలని సూచించింది. వారిలో ఎవరికైనా పాజిటివ్‌ వస్తే.. ఆయా శాంపిళ్లను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ విశ్లేషణకు పంపించాలని స్పష్టం చేసింది.

ఇదిలాఉంటే, దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌తో యావత్‌ ప్రపంచానికి మరో ముప్పు పొంచివుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిస్తోంది. దీంతో పలు దేశాలు దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణాలపై ఆంక్షలు విధించగా.. మరికొన్ని దేశాలు కొవిడ్‌ కట్టడి చర్యలు ముమ్మరం చేశాయి. ఈ వేరియంట్‌ ఇప్పటికే 14 దేశాలకు విస్తరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో మాత్రం ఇప్పటివరకు ఒమిక్రాన్‌ వేరియంట్‌ దాఖలాలు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినప్పటికీ కొత్త వేరియంట్లపై ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్‌ కన్సార్టియం (INSACOG) ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని