
Omicron Scare: టెస్టుల వేగం పెంచండి.. 9 రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు!
లేకుండా వైరస్ కట్టడి సాధ్యం కాదన్న కేంద్ర ఆరోగ్యశాఖ
దిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో దేశవ్యాప్తంగా కొవిడ్ ఉద్ధృతి ఊహించని రీతిలో పెరుగుతోన్న విషయం తెలిసిందే. విస్తృత వేగం, అధిక ప్రాబల్యం కలిగిన ఈ వేరియంట్ వ్యాప్తితో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ తీవ్రత క్రమంగా పెరుగుతోన్న రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి అప్రమత్తం చేసింది. ముఖ్యంగా 9 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో టెస్టుల సంఖ్యను భారీగా పెంచాలని కోరింది. ఇన్‌ఫెక్షన్ సోకిన వ్యక్తుల నుంచి ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చర్యలు చేపట్టాలని సూచిస్తూ ఆయా రాష్ట్రాలకు మరోసారి లేఖ రాసింది.
తమిళనాడు, పంజాబ్, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మిజోరం, మేఘాలయా, జమ్మూ, కశ్మీర్‌తో పాటు బిహార్ రాష్ట్రాల్లో కొవిడ్ పరీక్షలు తక్కువ చేయడం పట్ల కేంద్ర ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఓవైపు కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు పెరుగుతున్నా టెస్టుల సంఖ్య పెంచకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆశించిన స్థాయిలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయకపోతే వైరస్ వ్యాప్తిని అంచనా వేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్ రేటు అధికంగా ఉన్న దేశాల్లోనూ ఆందోళనకర వేరియంట్ విజృంభణతో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి ఆర్తి అహుజా ప్రస్తావించారు. అందుకే వైరస్ విజృంభణ ప్రారంభ దశలోనే దీనికి అడ్డుకట్ట వేయాలంటే కొవిడ్ టెస్టులను భారీగా పెంచాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. ఇందుకోసం కావాల్సిన టెస్టు కిట్లను, పరీక్షా కేంద్రాలు, అవసరమైన పరికరాల లభ్యతపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవాలని తొమ్మిది రాష్ట్రాలకు సూచించారు.
ఇదిలాఉంటే, రోజురోజుకు దేశవ్యాప్తంగా కొవిడ్ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన 24గంటల్లోనే 90వేల కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ఒక్కరోజే 495 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 2630కి చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే, ఒమిక్రాన్ నిర్ధారిత కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ వాస్తవ కేసుల సంఖ్య భారీగా ఉండవచ్చని ఆరోగ్యరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇవీ చదవండి
Advertisement