
Natural Vaccine: సహజ టీకా మాదిరిగా ఒమిక్రాన్..?
అంచనా వేస్తున్న నిపుణులు
ముంబయి: విస్తృత వేగంతో వ్యాపిస్తున్నట్లు భావిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్ కట్టడికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఇప్పటివరకు వచ్చిన నివేదికలను బట్టి చూస్తే డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ తీవ్రత తక్కువగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని వైద్యరంగ నిపుణులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా ఒమిక్రాన్ నిర్ధారణ అయిన వారిలో ఆస్పత్రి చేరికలు తక్కువగానే ఉంటున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఒకవేళ ఇదే పరిస్థితి మరికొంత కాలం కొనసాగితే ‘సహజ టీకా’గా ఒమిక్రాన్ పనిచేస్తుందని అభిప్రాయపడుతున్నారు.
‘డెల్టాతో పోలిస్తే కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఆస్పత్రుల్లో చేరికలు మాత్రం తక్కువగానే ఉంటున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగుతుందని ఆశిస్తున్నాం. ఒకవేళ ఇదే జరిగితే ఒమిక్రాన్ సహజ టీకాగా పనిచేయడంతోపాటు ఎండెమిక్ దశకు (స్థానికంగా వ్యాప్తి) చేరుకునేందుకు దోహదం చేస్తుంది’ అని మహారాష్ట్ర ఆరోగ్య విభాగానికి చెందిన అధికారి డాక్టర్ ప్రదీప్ అవాఠే పేర్కొన్నారు. సెకండ్ వేవ్ సమయంలో కేవలం రెండు (ఏప్రిల్, మే) నెలల్లోనే మహారాష్ట్రలో 60వేల మరణాలు సంభవించిన విషయాన్ని గుర్తుచేశారు. అనంతరం కేసులు తగ్గినప్పటికీ ప్రస్తుతం మళ్లీ పెరగడం చూస్తున్నామని అన్నారు.
చాలా మార్పులకు గురైన ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత తక్కువగా ఉన్నట్లు ఇప్పటివరకు వచ్చిన నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో వైరస్ ప్రభావం తక్కువగా ఉంటున్నట్లు ఇటీవల వచ్చిన అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నాయి. మరికొన్ని వారాల పాటు ఇదే రకమైన ఫలితాలు వస్తే రానున్న రోజుల్లో ఈ వేరియంట్‌పై పూర్తి అంచనాలకు రావచ్చని ప్రముఖ ఇమ్యూనాలజిస్ట్ డాక్టర్ ఎన్‌కే మిశ్రా పేర్కొన్నారు. అంతేకాకుండా రెండు డోసుల్లో వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఇది మూడో డోసుగా దోహదపడుతుందని మరో నిపుణుడు డాక్టర్ సందీప్ బుదిరాజా అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ఒమిక్రాన్‌ను నిరోధించడంలో నిర్లక్ష్యం చేయవద్దని వైద్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.