
Satya Pal Malik: ఏదైనా అన్యాయం జరిగితే మళ్లీ నేను మొదలుపెడతాను..
దిల్లీ: అధికార భాజపాలో ఉండి కేంద్ర ప్రభుత్వాన్నే విమర్శించే మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి ప్రధాని నరేంద్ర మోదీపైనే నేరుగా విమర్శలు గుప్పించారు. రైతులు చేస్తున్న ఆందోళనలపై చర్చించిన సమావేశంలో ప్రధాని చాలా అహంకార పూరితంగా ప్రవర్తించారని ఆరోపించారు. కేవలం ఐదు నిమిషాల్లోనే ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తాను మోదీతో వాగ్వాదానికి దిగినట్లు వెల్లడించారు. ఆ తర్వాత అమిత్ షాను కలవాలని మోదీ తనకు సూచించినట్లు తెలిపారు.
హరియాణాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాలిక్ ఈ మేరకు మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆందోళన అంశమని కాంగ్రెస్ విమర్శించింది. సాగు చట్టాల పోరాటంలో రైతులపై నమోదైన కేసులను రద్దు చేసే విషయంలో కేంద్రం నిజాయితీగా వ్యవహరించాలని మాలిక్ ఈ సందర్భంగా కోరారు. ఎంఎస్పీకి చట్టబద్ధమైన ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. ‘రైతు పోరాటం ఆగిపోయిందని ప్రభుత్వం అనుకుంటే పొరపాటే. తాత్కాలికంగా మాత్రమే ఆగిపోయింది. ఏదైనా అన్యాయం జరిగితే మళ్లీ నేను మొదలుపెడతాను’ అని మాలిక్ హెచ్చరించారు.
సత్యపాల్ గవర్నర్ పదవీ నిర్వహణ ఇప్పటి వరకూ భిన్నంగా నడుస్తూ వచ్చింది. ఆయన ఈ పదవి చేపట్టినప్పటి నుంచి నాలుగు రాష్ట్రాలకు బదిలీ అయ్యారు. ఒడిశా గవర్నర్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. 2017లో బిహార్ గవర్నర్‌గా నియామకం పొందిన మాలిక్.. 2018 ఆగస్టులో కశ్మీర్ గవర్నర్‌గా బదిలీ అయ్యారు. అనంతరం కేంద్రం ఆయన్ను మేఘాలయకు బదిలీ చేసింది.