
Covid Variant: ‘మేం అత్యవసర పరిస్థితి అంచున ఉన్నాం’
దక్షిణాఫ్రికా, హాంకాంగ్, ఇజ్రాయెల్‌లో కొవిడ్ కొత్త రకం
జెరూసలేం: అసాధారణ మ్యుటేషన్లతో కలవరపెడుతున్న కొత్త వేరియంట్( బి.1.1.529) ఇప్పుడు మరో దేశానికి వ్యాపించింది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ రకాన్ని తాజాగా ఇజ్రాయెల్‌లో కూడా గుర్తించారు. ఒక వ్యక్తికి పాజిటివ్‌గా తేలినట్లు అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. ‘దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త రకం వేరియంట్ ఇప్పుడు ఇజ్రాయెల్‌లో బయటపడింది. మాలావి నుంచి వచ్చిన వ్యక్తిలో ఈ వేరియంట్ పాజిటివ్‌గా తేలింది’ అని పేర్కొంది. అలాగే దీనిపై ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇప్పుడు తాము అత్యవసర పరిస్థితి అంచున ఉన్నామని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే వేగంగా, దృఢంగా ముందుకు సాగాల్సి ఉందని పేర్కొంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా, హాంకాంగ్‌లో ఈ కొత్త రకం వెలుగుచూసింది. ప్రస్తుతానికి భారత్‌లో ఈ రకం ఆనవాళ్లు లేవని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ.. ఓ మీడియా సంస్థ వెల్లడించింది.
ఐరోపా, అమెరికా దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు కాస్త అదుపులోనే ఉన్నాయి. డెల్టా వేరియంట్‌తో సతమతమైన పలు దేశాలు ఇప్పుడే కాస్త కుదుటపడుతున్నాయి. ఈ సమయంలోనే దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. దానిలోని అధిక మ్యుటేషన్ల కారణంగా మునుపటి వేరియంట్ల కంటే వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని, లక్షణాల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటాయన్న వార్తలు కలవరం పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు దేశాలు దక్షిణాఫ్రికా నుంచి రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇటలీ ఇప్పటికే దక్షిణాఫ్రికా, ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించింది. యూకే కూడా ఆరు ఆఫ్రికన్ దేశాలను రెడ్ లిస్ట్‌లో పెట్టింది. ఐరోపా సంఘం ఆ దిశగా ప్రణాళికలు రచిస్తోంది.