
Farmers Protest: సాగు చట్టాలు.. అన్నదాతల ఆగ్రహానికి నేటితో ఏడాది!
దిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సాగుచట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతన్నలు ఉద్యమం బాటపట్టిన విషయం తెలిసిందే. ఇలా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో మొదలైన పోరాటం నేటితో ఏడాది పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా రైతు సంఘాలు దేశ రాజధాని సరిహద్దులతో పాటు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ముఖ్యంగా రైతు ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన అన్నదాతలకు నివాళులు అర్పిస్తున్నారు. మరోవైపు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
చట్టాల రద్దుతో ఉద్యమం ఆగదు..
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు కేంద్రప్రభుత్వం చేసిన ప్రకటనను రైతు సంఘాలు స్వాగతించాయి. అయినప్పటికీ వీటిపై అధికారిక ప్రకటనతో పాటు కనీస మద్దతు ధర వంటి అంశాలపై తమ డిమాండ్లు నెరవేరే వరకూ తమ ఉద్యమం ఆగదని బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ స్పష్టం చేశారు. కేవలం సాగు చట్టాల రద్దు వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభించదని అన్నారు. మరోవైపు రైతులు చేస్తోన్న ఉద్యమానికి నేటికి ఏడాది పూర్తైన సందర్భంగా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. దీంతో ఉద్యమం కొనసాగిన దిల్లీ సరిహద్దు ప్రాంతాలకు భారీ సంఖ్యలో రైతన్నలు చేరుకుంటున్నారు. అప్రమత్తమైన దిల్లీ పోలీసులు.. ఘజియాబాద్ నుంచి దిల్లీ వచ్చే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు.
ఉద్యమం మొదలైందిలా..
కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకించిన రైతు సంఘాలు గతేడాది నవంబర్ 26న ‘చలో దిల్లీ’ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. దీంతో పంజాబ్, హరియాణాతో పాటు సమీప రాష్ట్రాలకు చెందిన వేలమంది అన్నదాతలు దిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు. నిరసన చేపట్టిన రైతులను దిల్లీ నగరంలోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన అన్నదాతలు దిల్లీ సమీపంలోని సింఘూ, టిక్రీ, ఘాజిపుర్ సరిహద్దుల వద్దే బైఠాయించారు. అనంతరం రైతుల ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చింది. పలు ప్రాంతాల నుంచి దిల్లీకి చేరే జాతీయ రహదారులను కూడా రైతులు దిగ్బంధించారు. అనంతరం మరింత తీవ్రరూపం దాల్చిన రైతు ఉద్యమం.. దేశ రాజధానిలో హింసాత్మక సంఘటనలకూ కారణమైంది. ఇలా రోడ్ల దిగ్బంధనలు, రైల్ రోకోలు, మహాపంచాయతీ వంటి కార్యక్రమాలతో సాగిన రైతు ఉద్యమం నేటికి ఏడాది పూర్తిచేసుకుంది. అయితే, ఈ ఉద్యమం ఏడాది పూర్తి చేసుకుంటున్న సమయంలోనే సాగు చట్టాలపై వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం.. వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదిత బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే వీటిని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.