Pegasus Row: రాహుల్‌ ఆధ్వర్యంలో.. విపక్షాల అల్పాహార భేటీ

పెగాసస్‌ స్పైవేర్‌ నిఘా వ్యవహారంపై పార్లమెంటులో నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ.. నేడు విపక్ష పార్టీ ఎంపీలు, వాటి సభాపక్ష నేతలతో భేటీ అయ్యారు.

Updated : 03 Aug 2021 11:39 IST

దిల్లీ: పెగాసస్‌ స్పైవేర్‌ నిఘా వ్యవహారంపై పార్లమెంటులో నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ.. నేడు విపక్ష పార్టీ ఎంపీలు, ఆయా సభాపక్ష నేతలతో భేటీ అయ్యారు. దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ప్రతిపక్షాల అల్పాహార విందు సమావేశం కొనసాగుతోంది. తృణమూల్‌ కాంగ్రెస్‌, శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ.. ఇలా 14 ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రభుత్వంపై విరుచుకుపడే ఉమ్మడి వ్యూహాన్ని రచించేలా వారితో రాహుల్‌ సమాలోచనలు జరపనున్నారు. అంతేగాక, కేంద్రం తీరుకు నిరసనగా పార్లమెంట్‌ బయట విపక్షాలు ‘మాక్‌ పార్లమెంట్‌’ నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నేటి సమావేశంలో దీనిపై చర్చించనున్నట్లు సమాచారం.

జులై 19న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే అందుకు ఒక్క రోజు ముందు పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారం వెలుగు చూసింది. పెగాసస్‌తో లక్ష్యంగా చేసుకున్న వారి జాబితాలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సహా పలువురు ప్రముఖులు ఉన్నట్లు తెలిసింది. దీంతో ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీనిపై నిరసనలు చేపట్టడంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. అయితే సభలో ప్రశాంతత నెలకొంటే చర్చలకు సిద్ధమేనని కేంద్రం చెబుతోంది. ఇదిలా ఉండగా.. పార్లమెంట్‌లో ప్రతిపక్షాల ఆందోళనల కారణంగా సభా సమయం వృథా అవుతోందని, ఇప్పటికే రూ.130కోట్లకు పైగా ప్రజల సొమ్ము వృథా అయ్యిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని