NCDs: ఈశాన్య రాష్ట్రాల్లో 26%మందిలో అసంక్రమిత వ్యాధులు!

ఈశాన్య రాష్ట్రాల్లోని దాదాపు 26శాతానికిపైగా జనాభా అసంక్రమిత వ్యాధుల (అంటువ్యాధులు కానివి -NCDs)తో బాధపడుతున్నట్లు తాజా సర్వేలో తేలింది.

Published : 31 Aug 2021 21:35 IST

అసోచామ్‌ సర్వేలో వెల్లడి

గుహవాటి: ఈశాన్య రాష్ట్రాల్లోని దాదాపు 26శాతానికిపైగా జనాభా అసంక్రమిత వ్యాధుల (అంటువ్యాధులు కానివి -NCDs)తో బాధపడుతున్నట్లు తాజా సర్వేలో తేలింది. ముఖ్యంగా అధిక రక్తపోటు, నరాలు, గుండె సమస్యలు వేధిస్తున్నాయని వెల్లడైంది. దేశంలో అసంక్రమిత వ్యాధుల సగటు కంటే ఈశాన్య రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఉండడం కలవరపెట్టే విషయమేనని ఆరోగ్యరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘నాన్‌కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ ఇన్‌ ఇండియా’ పేరుతో దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో 2.3లక్షల మందిపై అసోచామ్‌ జరిపిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

దేశంలో విస్తరిస్తోన్న అసంక్రమిత వ్యాధుల తీవ్రతను అంచనా వేసేందుకు భారత పరిశ్రమల సమాఖ్య అసోచామ్‌ ‘ఇల్‌నెస్‌ అండ్‌ వెల్‌నెస్‌’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించగా కేవలం ఈశాన్య రాష్ట్రాల్లోనూ అసంక్రమిత వ్యాధుల తీవ్రత అధికంగా ఉన్నట్లు గుర్తించింది. అస్సాంలో అత్యధికంగా 22.3శాతం మంది ఈ సమస్యలతో బాధపడుతుండగా.. ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో ఇది 26.2శాతంగా ఉన్నట్లు గుర్తించింది. జాతీయ సగటు 11.6శాతంగా ఉండగా.. ఈశాన్య రాష్ట్రాల్లోనే రెట్టింపు కంటే ఎక్కువగా ఉండడం ఆందోళనకర విషయంగా పేర్కొంది.

ఈశాన్య రాష్ట్రాల్లో అధిక రక్తపోటు, జీర్ణాశయ, నరాలు, గుండె సంబంధిత వ్యాధులే ఎక్కువగా ఉన్నట్లు అసోచామ్‌ సర్వేలో తేలింది. దేశ సగటుతో పోలిస్తే అసోంలో అత్యధికంగా కిడ్నీ, శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. మిగతా ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం కాన్సర్‌, మధుమేహం కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో గుర్తించారు. అక్కడి ప్రజలు అధిక మొత్తంలో మాంసాహారాన్ని (Red Meat) తీసుకుంటున్నట్లు సర్వేలో తెలిసింది. సర్వేలో పాల్గొన్న జనాభాలో 94శాతం మంది మాంసాహారాన్ని తీసుకున్నట్లు వెల్లడికాగా.. జాతీయ సగటు మాత్రం 66శాతంగా ఉంది. ఇదే సమయంలో పండ్లు, కూరగాయాలు వినియోగం కూడా ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువగానే ఉన్నట్లు సర్వేలో తేలింది. వీటికితోడు శారీరక శ్రమ కూడా తక్కువగానే ఉన్నట్లు గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని