Pakistan: ఆర్థిక కష్టాల్లో పాక్‌.. ప్రధాని నివాసం అద్దెకు!

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న పాకిస్థాన్‌.. ఆదాయ వనరులను సమకూర్చుకునేందుకు నానా తంటాలు పడుతోంది. ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి అధికారిక

Updated : 04 Aug 2021 14:14 IST

ఇస్లామాబాద్‌: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న పాకిస్థాన్‌.. ఆదాయ వనరులను సమకూర్చుకునేందుకు నానా తంటాలు పడుతోంది. ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి అధికారిక నివాసాన్నే అద్దెకు ఇవ్వాల్సిన పరిస్థితికి దిగజారింది. సాంస్కృతిక, ఫ్యాషన్‌, విద్యాపరమైన కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ప్రధాని అధికారిక నివాసాన్ని అద్దెకు ఇవ్వాలని పాక్‌ కేబినెట్‌ నిర్ణయించినట్లు అక్కడి మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

ఇందుకోసం రెండు కమిటీలను కూడా ఏర్పాటు చేశారట. కార్యక్రమాల నిర్వహణ సమయంలో ప్రధాని అధికారిక నివాస మర్యాదలు, క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ కమిటీలపై ఉంటుందని సదరు మీడియా కథనాలు రాసుకొచ్చాయి. ప్రధాని నివాసంలోని ఆడిటోరియం, రెండు గెస్ట్‌ వింగ్స్‌, ఒక లాన్‌ను అద్దెకు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.

2018లో పాక్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్‌ఖాన్‌.. తమ ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉందని అప్పుడే చెప్పారు. సంక్షేమ పథకాలు చేపట్టేందుకు తమ వద్ద డబ్బు లేదన్నారు. ఖర్చులు తగ్గించుకోవడం కోసం ప్రధాని అధికారిక నివాసాన్ని కూడా ఉపయోగించట్లేదు. పీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన బాని గాలా నివాసంలోనే ఉంటోన్న ఇమ్రాన్‌.. అధికారిక కార్యక్రమాల కోసం ప్రధాని కార్యాలయాన్ని వినియోగిస్తున్నారు. 

దీంతో ఖాళీగా ఉంటోన్న ప్రధాని అధికారిక నివాసాన్ని యూనివర్సిటీగా మారుస్తామని 2019లో ఇమ్రాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. అయితే తాజాగా ఆలోచనను విరమించుకున్న అక్కడి ప్రభుత్వం.. పీఎం అధికారిక నివాసాన్ని అద్దెకిచ్చి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇమ్రాన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత గత మూడేళ్లలో పాక్‌ ఆర్థిక వ్యవస్థ 19 బిలియన్‌ డాలర్లు పతనమవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు