
China-Pakistan: దోస్త్ మేరా దోస్త్.. చైనా అధ్యక్షుడితో పాక్ ప్రధాని ముచ్చట!
ద్వైపాక్షిక సంబంధాలపై ఇమ్రాన్ ఖాన్ - షీ జిన్‌పింగ్ చర్చ
ఇస్లామాబాద్: పాకిస్థాన్-చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఇరు దేశాలు మరోసారి పేర్కొన్నాయి. ముఖ్యంగా కొవిడ్ మహమ్మారి వల్ల ఏర్పడిన ఆర్థిక ప్రతికూలతలను అధిగమించేందుకు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (రెండో దశ) ఎంతో కీలకమని అభిప్రాయపడ్డాయి. తాజాగా ఉభయ దేశాల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు సహకారంపై పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఫోన్‌లో సమీక్ష జరినట్లు ఇరు దేశాల అధికారిక కార్యాలయాలు వెల్లడించాయి.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సంభాషణ సందర్భంగా కరోనా వైరస్ మహమ్మారిని చైనా ఎదుర్కొన్న తీరును పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసించారు. పాకిస్థాన్‌తో పాటు అభివృద్ధి చెందుతోన్న దేశాలకు వ్యాక్సిన్ అందించడంలో చైనా సహకారాన్ని కొనియాడారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి చూపుతోన్న ప్రతికూల ప్రభావాల నేపథ్యంలో ఇరు దేశాలు ఆర్థిక, వాణిజ్య అంశాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవా (China Pakistan Economic Corridor - CPEC)నుఅత్యంత నాణ్యతతో నిర్మించడంపై ఇమ్రాన్ ప్రశంసలు కురిపించినట్టు పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
అఫ్గాన్‌ను ఆదుకోండి..
అఫ్గాన్‌లో నెలకొన్న తాజా పరిస్థితులపైనా ఇరు దేశాధినేతలు చర్చించుకున్నారు. ముఖ్యంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అఫ్గానిస్థాన్‌కు మానవతా, ఆర్థిక సహాయం అందించేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అయితే, తాలిబన్ ప్రతినిధులతో చైనా రాయబారి కతర్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన కొన్ని గంటలకే వీరు ఈ ప్రకటన చేయడం గమనార్హం. అఫ్గాన్‌లో తాలిబన్‌లు ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని గుర్తించడంపై ప్రపంచ దేశాలు ఆచితూచి స్పందిస్తోన్న వేళ.. కేవలం పాకిస్థాన్, చైనాలు మాత్రమే వారికి సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా సెప్టెంబర్ నెలలో 31మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని చైనా అఫ్గాన్‌కు అందించింది.
70ఏళ్ల దౌత్య బంధం..
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (CPC) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు ఇమ్రాన్ ఖాన్ శుభాకాంక్షలు తెలిపారు. పేదరిక నిర్మూలనలో చైనా అపూర్వ విజయం సాధించిందంటూ ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇక పాకిస్థాన్-చైనా దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 70ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఇరువురు నాయకులు అభినందించుకున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ పర్యటనకు రావాలని షీ జిన్‌పింగ్‌ను పాక్ ప్రధాని ఆహ్వానించారు. ఇదిలాఉంటే, ఇరు దేశాలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న సీపెక్ (CPEC) ప్రాజెక్టును చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ 2015లో పాకిస్థాన్ పర్యటన సందర్భంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.