Pakistan: పాక్ ప్రధానికి నెట్టింట్లో ఇబ్బందికర పరిస్థితి..ఏమైందంటే..?

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు సొంత అధికారుల నుంచే తిరస్కరణ ఎదురైంది. సెర్బియాలోని పాక్ దౌత్యకార్యాలయం అధికారిక ట్విటర్ ఖాతాలో పెట్టిన పోస్టుతో ఆయన ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఇదేనా నయా పాకిస్థాన్‌ అంటూ వెలుగులోకి వచ్చిన ట్వీట్‌పై నెట్టింట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

Updated : 03 Dec 2021 22:19 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు సొంత అధికారుల నుంచే తిరస్కరణ ఎదురైంది. సెర్బియాలోని పాక్ దౌత్యకార్యాలయం అధికారిక ట్విటర్ ఖాతాలో పెట్టిన పోస్టుతో ఆయన ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఇదేనా నయా పాకిస్థాన్‌ అంటూ వెలుగులోకి వచ్చిన ట్వీట్‌పై నెట్టింట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

‘ఒకవైపు ద్రవ్యోల్బణం మునుపటి రికార్డులను బద్దలు కొడుతోంది. మూడు నెలల నుంచి జీతాలు అందకపోయినా, ప్రభుత్వ ఉద్యోగులు ఎంతకాలం నిశ్శబ్దంగా ఉంటారని మీరు(ఇమ్రాన్ ఖాన్‌)భావిస్తున్నారు. ఫీజులు చెల్లించకపోవడంతో మా పిల్లల్ని పాఠశాల నుంచి బయటకు పంపించివేశారు. ఇదా నయా పాకిస్థాన్ అంటే..?’ అంటూ సెర్బియాలోని పాకిస్థాన్ దౌత్యకార్యాలయం అధికారిక ఖాతాలో పోస్టు ప్రత్యక్షమైంది. దాంతో పాటు ఓ పేరడీ వీడియోను కూడా షేర్ చేస్తూ.. ‘క్షమించండి ఇమ్రాన్ ఖాన్. నాకు మరో అవకాశం లేదు’ అంటూ ఆ పోస్టు పెట్టిన వ్యక్తి రాసుకొచ్చారు. అది వెరిఫైడ్ ఖాతా కావడం గమనార్హం.

ఈ ట్వీట్‌పై నెటిజన్లు స్పందించారు. ఈ ఖాతాను ఎవరైనా హ్యాక్ చేసి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. మరికొందరు ఆ పోస్టు పెట్టిన వ్యక్తికి మద్దతుగా నిలిచారు. నిరాశా నిస్పృహలే అలా మాట్లాడించాయన్నారు. ‘పాకిస్థాన్ పతనం అంచున ఉంది. మీరు దౌత్యకార్యాలయానికి చెందిన ఆస్తులు అమ్ముకొని, ఏదో ఒక పాశ్చాత్య దేశంలో స్థిరపడండి’ అంటూ ఓ నెటిజన్ ఉచిత సలహా ఇచ్చారు. ఈ ఖాతాను నిర్వహిస్తోన్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇది పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న అధికారిక ఖాతా అంటూ ఇంకొకరు మండిపడ్డారు. అయితే ఈ ట్వీట్‌పై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

ఈ 70 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా గత మూడేళ్లలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరుకుందని అక్టోబర్‌లో ఓ నివేదిక వెల్లడించింది. అక్కడ నిత్యావసర ధరలు పెరిగిపోవడంపై విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని