Panjshir vs Taliban: పంజ్‌షేర్‌లో పాపిస్థాన్‌ రక్తపు చేతులు..! 

ప్రపంచ దేశాలు మొండి చేయి చూపడంతో పంజ్‌షేర్‌లోని రెసిస్టెన్స్‌ ఫోర్సెస్‌ తాలిబన్లతో పోరాడి అలసిపోతున్నాయి. మరోపక్క తాలిబన్లకు మాత్రం పాకిస్థాన్‌ బహిరంగానే మద్దతు ఇస్తోంది. ఇన్నాళ్లు మాకు తెలియదు..

Updated : 06 Sep 2021 16:18 IST

* లోయను స్వాధీనం చేసుకొన్నామన్న తాలిబన్లు

* పంజ్‌షేర్‌ దళాలపై పాక్‌ డ్రోన్లతో దాడి..! 
* నేలకొరిగిన ఫాహిమ్‌ దాస్తీ


ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ప్రపంచ దేశాలు మొండి చేయి చూపడంతో పంజ్‌షేర్‌లోని రెసిస్టెన్స్‌ ఫోర్సెస్‌ తాలిబన్లతో పోరాడి అలసిపోతున్నాయి. మరోపక్క తాలిబన్లకు మాత్రం పాకిస్థాన్‌ బహిరంగంగానే మద్దతు ఇస్తోంది. ఇన్నాళ్లు ‘మాకు తెలియదు.. తాలిబన్లకు మేం సాయం చేయడం లేదు’ అని చెప్పిన దాయాది.. తాజాగా నేరుగా తన డ్రోన్లను పంజ్‌షేర్‌కు పంపినట్లు వార్తలొస్తున్నాయి. ఈ డ్రోన్లను పంజ్‌షేర్‌ దళాలపై దాడి చేయడానికి వినియోగించినట్లు సమాచారం. పంజ్‌షేర్‌ లోయను పూర్తిగా స్వాధీనం చేసుకొన్నామని తాలిబన్‌ దళాలు ప్రకటించాయి. రెసిస్టెన్స్‌ ఫోర్సెస్‌ (ఎన్‌ఆర్‌ఎఫ్ఏ)అధికార ప్రతినిధి ఫాహిమ్‌ దాస్తీ ఆదివారం నేలకొరిగారు. నిన్న పంజ్‌షేర్‌ ప్రావిన్స్‌లో జరిగిన భారీ పోరాటంలో ఆయన చనిపోయినట్లు ఎన్‌ఆర్‌ఎఫ్ఏ దళాల వర్గాలు వెల్లడించాయి.

మరోపక్క తాలిబన్లతో కలిసి అధికారం పంచుకొనేందుకు తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో దాస్తీ కూడా ఒకరు. యుద్ధంతో అతలాకుతలమైన ప్రజలకు మంచి జీవితాలను అందించడం కోసం తమ దళాలు చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాయని ఆయన ఒక సందర్భంలో వెల్లడించారు.

పాక్‌ డ్రోన్‌ల సాయం.. లోయ స్వాధీనం..?

పంజ్‌షేర్‌ లోయను సంపూర్ణంగా స్వాధీనం చేసుకొన్నట్లు తాలిబన్లు సోమవారం ప్రకటించారు. ఈ విషయాన్ని ఆంగ్ల వార్తా సంస్థ ఏఎఫ్‌పీ వెల్లడించింది. నిన్న పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్లు పంజ్‌షేర్‌ దళాలపై విస్తృతంగా దాడులు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని పాకిస్థాన్‌ ఎంపీ జియా అరియాంజాద్‌ అమాజ్‌ న్యూస్‌కు వెల్లడించారు. ఈ దాడులకు పాక్‌ స్మార్ట్‌ బాంబులను వినియోగించినట్లు ఆయన వివరించారు. మరోపక్క అహ్మద్‌ మసూద్‌ కూడా పాక్‌ డ్రోన్ల దాడులను సోమవారం ధ్రువీకరించారు. తాలిబన్‌ ఉగ్ర సంస్థకు పాకిస్థాన్‌ మద్దతు ఇస్తోందని వెల్లడించారు. పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ చీఫ్‌ ఫయాజ్‌ అహ్మద్‌ గత కొన్ని రోజులుగా కాబుల్‌లో తిష్ఠవేశారు. ఆయన కనుసన్నల్లోనే పాక్‌ వాయుసేన డ్రోన్లు, హెలికాప్టర్లు దాడులు నిర్వహించినట్లు మసూద్‌ ఆరోపించారు. పాక్‌ కొంతమంది కమాండోలను కూడా ఎయిర్‌డ్రాప్‌ చేసినట్లు సమాచారం.

అమ్రుల్లా ఇంటిపై హెలికాప్టర్లతో దాడి..

అఫ్గాన్‌ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ నివశించే ఇంటిపై ఆదివారం హెలికాప్టర్లతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆ దాడి నుంచి అమ్రుల్లా సురక్షితంగా తప్పించుకొని గుర్తుతెలియని ప్రదేశానికి వెళ్లిపోయారు. 

గతంలో వెంట్రుకవాసిలో తప్పించుకొని..

వాస్తవానికి 9/11 దాడులకు రెండ్రోజుల ముందు పంజ్‌షేర్‌ నాయకుడు అహ్మద్‌షా మసూద్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో మసూద్‌ తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతూ మృతి చెందారు. ఆ దాడి నుంచి దాస్తీ ప్రాణాలతో బయటపడ్డారు. పంజ్‌షేర్‌ దళాలకు ఆయనే అధికార ప్రతినిధి. ఆయన తరచూ ట్విటర్లో ఎన్‌ఆర్‌ఎఫ్‌సీ దళాల సమాచారాన్ని అందిస్తూ వచ్చారు. ఇటీవల ఒక ఆంగ్ల ఛానల్‌తో మాట్లాడుతూ..‘‘మేం ప్రతిఘటిస్తూ మరణిస్తే అది మా విజయం అవుతుంది. దేశం కోసం తుది రక్తం చుక్క వరకూ పోరాడిన యోధులుగా చరిత్రలో మా పేరు లిఖిస్తారు’’ అని దాస్తీ పేర్కొన్నారు. ఆదివారం జరిగిన దాడిలో ఫాహిం దాస్తీతోపాటు అహ్మద్‌ షా మసూద్‌ మేనల్లుడు సాహిబ్‌ అబ్దుల్‌ వాదూద్‌ జహోర్‌ కూడా మరణించినట్లు సమాచారం. తాము ఇద్దరు కీలక నాయకులను కోల్పోయినట్లు ఎన్‌ఆర్‌ఎఫ్‌ఏ ఫేస్‌బుక్‌ పేజీలో పేర్కొన్నారు.

మత పెద్దలతో చర్చలకు సిద్ధం..: అహ్మద్‌ మసూద్‌

చర్చలు జరిపి అఫ్గానిస్థాన్లో యుద్ధం ముగించాలని మతపెద్దలు ఇచ్చిన పిలుపునకు పంజ్‌షేర్‌ దళాలు సానుకూలంగా స్పందించాయి. ఈ మేరకు ఎన్‌ఆర్‌ఎఫ్‌ఏ ఫేస్‌బుక్‌ పేజీలో దళాల అధినేత అహ్మద్‌ మసూద్‌ స్పందించారు. ‘‘ప్రస్తుత సమస్యను పరిష్కరించుకోవడానికి సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నాం. తక్షణమే పోరాటాన్ని నిలిపివేసి చర్చలు కొనసాగించాలి. దీనికి ఎన్‌ఆర్‌ఎఫ్‌ఏ దళాలు అంగీకరిస్తున్నాయి. తాలిబన్లు కూడా దాడులను నిలిపివేయడంతోపాటు పంజ్‌షేర్‌, అంద్రాబ్‌లకు సైనిక బలగాల తరలింపును కూడా ఆపేయాలి’’ అని మసూద్‌ పేర్కొన్నారు. అంతకుముందు అఫ్గానిస్థాన్‌లోని మతపెద్దలు.. తాలిబన్లు చర్చలతో సమస్య పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. దీనికి తాలిబన్లు వెంటనే స్పందించలేదు.

తాలిబన్ల సోషల్‌ మీడియా వార్‌..

ఇప్పటికే పంజ్‌షేర్‌ దళాలకు సోషల్‌ మీడియా వంటివి అందుబాటులో లేకుండా తాలిబన్లు చర్యలు తీసుకొన్నారు. విద్యుత్తు లైన్లు, టెలిఫొన్‌ లైన్లు, ఇంటర్నెట్‌ సేవలను పూర్తిగా నిలిపివేశారు. మరో పక్క ఏకపక్షంగా గత కొన్ని రోజులుగా పలుమార్లు పంజ్‌షేర్‌ను ఆక్రమించుకొన్నట్లు తాలిబన్లు  సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకొన్నారు. కానీ, ఆ తర్వాత అటువంటిదేమీ లేదని తేలింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని