Pegasus Spyware: ముగ్గురు టెక్‌ దిగ్గజ నిపుణులతో పెగాసస్‌ దర్యాప్తు..!

సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.వి. రవీంద్రన్‌ నేతృత్వంలో జరిగే ఈ దర్యాప్తును చేపట్టేందుకు సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ ఫోరెన్సిక్‌తోపాటు నెట్‌వర్క్స్‌, హార్డ్‌వేర్‌ రంగాల్లో అత్యంత అనుభవం ఉన్న ముగ్గురు నిపుణులను సుప్రీం కోర్టు ఎంపిక చేసింది.

Published : 27 Oct 2021 19:27 IST

సుప్రీం ఏర్పాటు చేసిన స్వతంత్ర కమిటీలో ఎవరున్నారంటే..

దిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపిన పెగాసెస్‌ హ్యాకింగ్‌ ఉదంతంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపేందుకు భారత అత్యున్నత న్యాయస్థానం స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.వి. రవీంద్రన్‌ నేతృత్వంలో జరిగే ఈ దర్యాప్తును చేపట్టేందుకు సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ ఫోరెన్సిక్‌తోపాటు నెట్‌వర్క్స్‌, హార్డ్‌వేర్‌ రంగాల్లో అత్యంత అనుభవం ఉన్న ముగ్గురు నిపుణులను సుప్రీం కోర్టు ఎంపిక చేసింది. అంతేకాకుండా దర్యాప్తులో భాగంగా వీరికి విస్తృత అధికారాలను కూడా సుప్రీం కోర్టు కల్పించింది.

పెగాసస్‌ దర్యాప్తునకు సంబంధించిన వివరాలను ఈ ముగ్గురు నిపుణుల కమిటీ ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ రవీంద్రన్‌కు నివేదిస్తారు. వీరితో పాటు మాజీ ఐపీఎస్‌ అధికారి అలోక్‌ జోషి, ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ స్టాండర్డైజేషన్‌ (ISO) సబ్‌కమిటీ ఛైర్మన్‌ సందీప్‌ ఒబెరాయ్‌లు జస్టిస్‌ రవీంద్రన్‌కు సహకారం అందించనున్నారు. పెగాసస్‌పై విచారణ చేపట్టనున్న సాంకేతిక కమిటీలోని ముగ్గురు నిపుణుల వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రొఫెసర్‌ చౌదరీ: గుజరాత్‌లోని నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీకి డీన్‌గా చౌదరీ వ్యవహరిస్తున్నారు. విద్యావేత్తగా రెండు దశాబ్దాల అనుభవం ఉన్న చౌదరీ.. సైబర్‌ సెక్యూరిటీ విభాగంలో అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తిగా పేరొందారు.

ప్రొఫెసర్‌ ప్రభాహరణ్‌: కేరళలోని అమృత విశ్వ విద్యాపీఠం (స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌)కు చెందిన ప్రొఫెసర్‌ ప్రభాహరణ్‌కు కంప్యూటర్‌ సైన్స్‌, సెక్యూరిటీ విభాగాల్లో రెండు దశాబ్దాల అనుభవం ఉంది. ముఖ్యంగా మాల్‌వేర్‌ గుర్తింపు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ విభాగాల్లో అత్యంత నైపుణ్యం ఉంది. అంతేకాకుండా ఈయన రాసిన ఎన్నో వ్యాసాలు ప్రముఖ జర్నల్‌లలో ప్రచురితమయ్యాయి.

అనిల్ గుమస్తే: ఐఐటీ బాంబేలోని కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా అశ్విన్‌ అనిల్‌ గుమస్తే విధులు నిర్వర్తిస్తున్నారు. వివిధ విభాగాల్లో అమెరికా నుంచి 20 పేటెంట్లను పొందడమే కాకుండా ఆయన రాసిన 150 పేపర్లు ప్రముఖ జర్నల్‌లలో ప్రచురితమయ్యాయి. వీటితోపాటు కంప్యూటర్‌ విభాగంలో మూడు పుస్తకాలు కూడా రాశారు. విక్రం సారాభాయ్‌ రీసెర్చ్‌ అవార్డు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగంలో శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ ప్రైజ్‌ను అందుకున్నారు. అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో విజిటింగ్‌ సైంటిస్ట్‌గానూ అనిల్‌ గుమస్తే ఉన్నారు.

ఇలా సాంకేతిక రంగంలో ప్రఖ్యాతి చెందిన నిపుణులతో స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసిన సుప్రీం ధర్మాసనం సాధ్యమైనంత వీలుగా విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. పెగాసస్‌ హ్యాకింగ్‌ ఉదంతంతోపాటు ఇప్పటికే అమలులో ఉన్న గోప్యతా చట్టానికి సంబంధించి ఏవైనా మార్పులపైనా సిఫార్సులు చేయాలని కమిటీకి సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని