Delta Variant: డెల్టాపై ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా టీకాల ప్రభావమెంత..?

కరోనా వైరస్‌ వెలుగు చూసిన తొలినాళ్లలో బయటపడిన (ఆల్ఫా) వేరియంట్‌తో పోలిస్తే ప్రస్తుతం అత్యధిక ప్రాబల్యం కలిగిన డెల్టా వేరియంట్‌పై ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ల ప్రభావశీలత కాస్త తక్కువేనని తాజా అధ్యయనం వెల్లడించింది.

Published : 19 Aug 2021 15:10 IST

వాస్తవ ఫలితాలపై ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అధ్యయనం

లండన్‌: కరోనా వైరస్‌ వెలుగు చూసిన తొలినాళ్లలో బయటపడిన (ఆల్ఫా) వేరియంట్‌తో పోలిస్తే ప్రస్తుతం అత్యధిక ప్రాబల్యం కలిగిన డెల్టా వేరియంట్‌పై ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ల ప్రభావశీలత కాస్త తక్కువేనని తాజా అధ్యయనం వెల్లడించింది. అయినప్పటికీ ఇతర వేరియంట్ల నుంచి ఈ రెండు వ్యాక్సిన్లు పూర్తి రక్షణ కలిగిస్తున్నాయని తెలిపింది. కొత్తగా వెలుగు చూస్తోన్న కరోనా వేరియంట్లపై వ్యాక్సిన్‌ల వాస్తవ పనితీరును తెలుసుకునేందుకు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ జరిపిన అధ్యయనంలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి.

డెల్టాపై ప్రభావం తక్కువే..!

ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్లన్నింటినీ తొలుత వుహాన్‌లో బయటపడిన వేరియంట్‌ ఆధారంగానే రూపొందించారు. క్లినికల్‌ ప్రయోగాలు కూడా కొన్ని వేల మందిపైనా జరిపారు. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్లపై కరోనా వ్యాక్సిన్‌ల వాస్తవ ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు భారీ అధ్యయనం చేపట్టారు. డిసెంబర్‌ 1, 2020 నుంచి మే 16, 2021 మధ్య కాలంలో చేపట్టిన ఈ అధ్యయనంలో పాల్గొన్న 3లక్షల 80వేల మంది నుంచి సేకరించిన 25లక్షల స్వాబ్‌ నమూనాల ఫలితాలను పరిశోధకులు విశ్లేషించారు. వీరి నుంచి మే 17 నుంచి ఆగస్టు 1 వరకు మరోసారి సేకరించిన 8లక్షల ఫలితాలను కూడా విశ్లేషించారు. తద్వారా వైరస్‌ బారినపడని వ్యాక్సిన్‌ పొందిన వారితో పోలిస్తే.. వైరస్‌ నుంచి కోలుకున్న తర్వాత వ్యాక్సిన్‌ తీసుకున్న వారికే టీకాల నుంచి ఎక్కువ రక్షణ కలుగుతోందనే నిర్ధారణకు వచ్చారు. ఇక డెల్టా వేరియంట్‌ ప్రభావం విషయానికొస్తే.. రెండు మోతాదుల్లో వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత నమోదైన కేసులు.. వ్యాక్సిన్‌ తీసుకోని కేసుల్లో డెల్టా ఇన్‌ఫెక్షన్‌ స్థాయిలు ఒకే మాదిరిగా అధికంగా ఉన్నట్లు గుర్తించారు. అదే అల్ఫాలో మాత్రం టీకా తీసుకున్న తర్వాత వైరస్‌ సోకిన వారిలో ఇన్‌ఫెక్షన్‌ స్థాయిలు తక్కువగానే ఉన్నాయని ఆక్స్‌ఫర్డ్‌ నిపుణులు కనుగొన్నారు.

టీకా తీసుకోనివారికి పొంచివున్న ముప్పు..!

వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ బారినపడిన (Breakthrough Infection) వారినుంచి ఏ మేరకు వైరస్‌ సంక్రమణ జరుగుతోందనే విషయం తెలియదని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సారా వాల్కర్‌ పేర్కొన్నారు. అయితే, వ్యాక్సిన్‌ తీసుకోని వారికి మాత్రం డెల్టా వేరియంట్‌ నుంచి రక్షణ ఉండదని స్పష్టం చేశారు. అందుకే సాధ్యమైనంత వరకు పూర్తి మోతాదుల్లో వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించారు. టీకా ప్రభావశీలతపై రెండు మోతాదుల మధ్య కాల వ్యవధి అంతగా ప్రభావం చూపకపోవచ్చని సారా వాల్కర్‌ వెల్లడించారు. అయినప్పటికీ రెండు డోసుల తర్వాత కలిగే ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయని చెప్పారు. కొవిడ్‌ వైరస్‌ బారినపడే అవకాశాలను ఈ వ్యాక్సిన్‌లు తగ్గిస్తున్నప్పటికీ.. కొవిడ్‌-19 ఇవి పూర్తిగా నిర్మూలించలేవని ఆక్స్‌ఫర్డ్‌ నిపుణులు మరోసారి గుర్తుచేశారు.

ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత వైరస్‌ నుంచి అధిక రక్షణ కలుగుతున్నప్పటికీ అది కొన్ని నెలలు మాత్రమే ఉంటున్నట్లు తాజా అధ్యయనం ద్వారా వెల్లడైంది. కానీ, ఆస్ట్రాజెనెకాతో పోలిస్తే ఫైజర్‌ తీసుకున్న వారిలో త్వరతగతిన ఈ రక్షణ కోల్పోతున్నట్లు నిపుణులు అంచనాకు వచ్చారు. ముఖ్యంగా ఈ రెండు వ్యాక్సిన్‌ల నుంచి 4 నుంచి 5 నెలల వరకు పూర్తి రక్షణ ఉంటుందని అభిప్రాయపడిన ఆక్స్‌ఫర్డ్‌ నిపుణులు.. దీర్ఘకాల రక్షణపై అధ్యయనాలు కొనసాగుతున్నాయని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని