Pfizer Covid Pill: కొవిడ్‌ ఔషధ సామర్థ్యం 90శాతం.. ఒమిక్రాన్‌పైనా ప్రభావవంతం!

కొవిడ్‌-19 చికిత్సలో భాగంగా ఫైజర్‌ రూపొందించిన యాంటీవైరల్‌ ఔషధం 90శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తుది విశ్లేషణ ఫలితాల్లో వెల్లడైంది.

Published : 14 Dec 2021 21:40 IST

తుది ఫలితాలు వెల్లడించిన ఫైజర్‌

వాషింగ్టన్‌: కొవిడ్‌-19 చికిత్సలో భాగంగా ఫైజర్‌ రూపొందించిన యాంటీవైరల్‌ ఔషధం 90శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తుది విశ్లేషణ ఫలితాల్లో వెల్లడైంది. ముఖ్యంగా వైరస్‌ ముప్పు అధికంగా ఉన్న బాధితులు తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడం, మరణం ముప్పు తగ్గించడంలో తమ ఔషధం 90శాతం సమర్థత చూపించిందని ఆ సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా కొత్తగా వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌పైనా ఆశాజనక ఫలితాలు ఇస్తున్నట్లు ల్యాబ్‌ పరిశోధన సమాచారం ద్వారా తెలుస్తోందని ఫైజర్‌ స్పష్టం చేసింది.

కొవిడ్‌ చికిత్స కోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న రైటోనవిర్‌ (Ritonavir)తో కలిపి కాంబినేషన్‌ రూపంలో తీసుకునే ఔషధాన్ని ఫైజర్‌ అభివృద్ధి చేసింది. ప్రయోగాల్లో భాగంగా దీనిని 2250 మంది బాధితులపై పరీక్షించారు. స్వల్ప లక్షణాలు ఉన్నవారితో పాటు ఊబకాయం వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలున్న బాధితులు, వృద్ధులను పరిగణనలోకి తీసుకున్నారు. మొత్తం వాలంటీర్లలో ప్లెసిబో తీసుకున్న వారిలో 12మంది మృతి చెందగా.. అసలైన ఔషధం తీసుకున్న వారిలో ఒక్క మరణం కూడా చోటుచేసుకోలేదని ఫైజర్‌ యాజమాన్యం వెల్లడించింది. తద్వారా ఫైజర్‌ ఔషధం ఆస్పత్రిలో చేరిక, మరణాల నుంచి 90శాతం సమర్థత చూపించిందని తెలిపింది. పాక్స్‌లోవిడ్‌ (Paxlovid) బ్రాండ్‌ పేరుతో ఈ యాంటీవైరల్‌ ఔషధాన్ని ఫైజర్‌ అందుబాటులోకి తేనుంది. వైద్యుల సూచన మేరకు ఈ ఔషధాన్ని రోజుకు రెండుసార్లు (12 గంటల వ్యవధి చొప్పున) ఐదు రోజుల పాటు తీసుకోవాల్సి ఉంటుంది.

ప్రాణాలు కాపాడటమే ముఖ్యం..

తుది విశ్లేషణలో ఈ విధమైన ఫలితాలు రావడం అద్భుతమని ఫైజర్‌ చీఫ్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ మైఖేల్‌ డోల్‌స్టెన్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ నుంచి ఎంతో మంది ప్రాణాలు కాపాడడం, ఆస్పత్రుల్లో చేరికలు నివారించడమే ప్రధానమన్న ఆయన.. ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు గుర్తించిన వెంటనే వీటిని ఇవ్వడం వల్ల వైరస్‌ వ్యాప్తిని కూడా గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. అధిక ముప్పు ఉన్నవారికి ఈ ఔషధాన్ని వినియోగించేందుకు అమెరికా ఎఫ్‌డీఏ నుంచి త్వరలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు యూరప్‌ దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నియంత్రణ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని మైఖేల్‌ డోల్‌స్టెన్‌ వెల్లడించారు.

ఇదిలాఉంటే, కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు అమెరికాలో వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చినప్పటికీ నోటి ద్వారా తీసుకునే యాంటీవైరల్‌ చికిత్స మాత్రం ఇప్పటివరకు అనుమతి లేదు. తాజాగా మరో సంస్థ మెర్క్‌ అండ్‌ కో రూపొందించిన మోల్నూఫిరవిర్‌ ఔషధం సానుకూల ఫలితాలు ఇస్తున్నట్లు ఈమధ్యే వచ్చిన ఫలితాల్లో తేలింది. ఇప్పటికే మెర్క్‌ వినియోగానికి బ్రిటన్‌ నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది. అయితే, మోల్నూఫిరవిర్‌తో పోలిస్తే ఫైజర్‌ ఔషధం సమర్థతే ఎక్కువగా ఉన్నట్లు తుది ఫలితాలను బట్టి తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని