Pfizer Pill: ఫైజర్‌ ఔషధం.. 89శాతం తప్పుతున్న మరణం ముప్పు!

కొవిడ్‌కు ముకుతాడు వేయడంలో ఫైజర్‌ రూపొందించిన యాంటీవైరల్‌ ఔషధం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ప్రయోగాల్లో తేలింది.

Updated : 06 Nov 2021 11:13 IST

ప్రయోగాల్లో మెరుగైన ఫలితాలు కనిపించాయన్న ఫైజర్‌

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ను నిరోధించేందుకు ఇప్పటికే సమర్థమంతమైన వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇదే సమయంలో చికిత్స కోసం ఔషధాలపై ముమ్మర ప్రయోగాలూ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కొవిడ్‌కు ముకుతాడు వేయడంలో ఫైజర్‌ రూపొందించిన యాంటీవైరల్‌ ఔషధం సమర్థంగా పనిచేస్తున్నట్లు ప్రయోగాల్లో తేలింది. ముఖ్యంగా తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి చేరికతో పాటు మరణం ముప్పును తగ్గించడంలో తమ ఔషధం 89శాతం సమర్థత చూపించిందని ఆ సంస్థ వెల్లడించింది. కొవిడ్‌ బాధితుల ప్రాణాలను రక్షించే సామర్థ్యమున్న ఈ ఔషధ ప్రయోగాల సమాచారాన్ని త్వరలోనే నియంత్రణ సంస్థలకు అందిస్తామని ప్రకటించింది.

కొవిడ్‌ చికిత్స కోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న రైటోనవిర్‌ (Ritonavir)తో కలిపి కాంబినేషన్‌ రూపంలో తీసుకునే ఔషధాన్ని ఫైజర్‌ అభివృద్ధి చేసింది. దీనిని 1219 మంది రోగులపై పరీక్షించించారు. స్వల్ప లక్షణాల ఉన్నవారితో పాటు ఊబకాయం వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలున్న బాధితులు, వృద్ధులను పరిగణనలోకి తీసుకున్నారు. కొవిడ్‌ లక్షణాలు కనిపించిన మూడు నుంచి ఐదు రోజుల్లోనే ఈ యాంటీవైరల్‌ ఔషధాన్ని అందించారు. ఔషధం తీసుకున్న వారిలో కేవలం 0.8శాతం మంది ఆస్పత్రి బారినపడగా.. చికిత్స తీసుకున్న 28రోజుల్లో ఎవ్వరూ మరణించలేదు. అదే ప్లెసిబోతో 7శాతం మంది ఆస్పత్రిలో చేరాల్సి రాగా.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఔషధ సామర్థ్యం 89శాతంగా అంచనా వేస్తున్నారు.

దుష్ర్పభావాలు తక్కువే..

పాక్స్‌లోవిడ్‌ (Paxlovid) బ్రాండ్‌ పేరుతో ఫైజర్‌ ఈ యాంటీవైరల్‌ ఔషధాన్ని అందుబాటులోకి తేనుంది. మూడు మాత్రల్లో లభించే ఈ ఔషధాన్ని రోజుకు రెండుసార్లు తీసుకోవాల్సి ఉంటుంది. 20శాతం బాధితుల్లో మాత్రమే దుష్ర్పభావాలు కనిపించినట్లు పేర్కొన్న ఫైజర్‌ సంస్థ.. అవి ఎలాంటివి అని మాత్రం వెల్లడించలేదు. ఔషధ ప్రయోగాల మధ్యంతర సమాచారాన్ని త్వరలోనే నియంత్రణ సంస్థలకు అందజేస్తామని పేర్కొంది. ఒకవేళ అనుమతి వస్తే బాధితుల్లో ఇన్‌ఫెక్షన్‌ తీవ్రతను తగ్గించి వారి ప్రాణాలను నిలిపే సామర్థ్యం ఉందని ఫైజర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆల్బర్ట్‌ బౌర్లా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివరి నాటికి లక్షా 80వేల ప్యాకెట్లను అందుబాటులోకి తెస్తామని.. 2022 చివరినాటికి కనీసం 5కోట్ల ప్యాకెట్లను సిద్ధం చేస్తామని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే, కొవిడ్‌ చికిత్సలో భాగంగా మెర్క్‌ అండ్‌ కో సంస్థ రూపొందించిన మోల్నూఫిరవిర్‌ ఔషధం సానుకూల ఫలితాలు ఇస్తున్నట్లు ఈ మధ్యే వెల్లడైంది. బ్రిటన్‌ నియంత్రణ సంస్థ కూడా మెర్క్‌ వినియోగానికి ఈ వారమే ఆమోదం తెలిపింది. ఇదే సమయంలో తాజాగా మోల్నూఫిరవిర్‌ కంటే ఫైజర్‌ ఔషధం మరింత సమర్థంగా పనిచేస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌, మరణాలను తగ్గించడంలో ఔషధం 89శాతం సమర్థత ఉందని ప్రకటన రావడంతో ఫైజర్‌ సంస్థ షేర్లు ఒక్కసారిగా 13శాతం పెరిగిపోగా.. మెర్క్‌ షేర్లు మాత్రం 6శాతం పడిపోయాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని