Pharmacy of World: ‘ప్రపంచ ఫార్మసీ’గా భారత్‌..!

‘ఫార్మసీ ఆఫ్‌ ది వరల్డ్‌’గా అవతరించడం గడిచిన 75ఏళ్లలో భారత్‌ సాధించిన లక్ష్యాల్లో అతిపెద్దదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ పేర్కొన్నారు.

Published : 03 Oct 2021 16:30 IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్యస్వామినాథన్‌

దిల్లీ: ప్రజారోగ్యరంగంలో గత కొన్నేళ్లుగా భారత్‌ పురోగతి సాధిస్తున్నట్లు అంతర్జాతీయ నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా పోలియో నిర్మూలన, శిశు మరణాల రేటును తగ్గించడంలో భారత్‌ మెరుగైన పనితీరు కనబరిచిందని చెబుతున్నారు. ఇలా ‘ఫార్మసీ ఆఫ్‌ ది వరల్డ్‌’గా అవతరించడం గడిచిన 75ఏళ్లలో భారత్‌ సాధించిన లక్ష్యాల్లో అతిపెద్దదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ తెలిపారు. ఏడున్నర దశాబ్దాల్లో ఆరోగ్య రంగంలో భారత్‌ సాధించిన విజయాలపై ఓ జాతీయ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌమ్య స్వామినాథన్‌ ప్రస్తావించారు.

పోలియో నిర్మూలన, మాతా శిశు మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించడం, పలురకాల వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలు, యూనివర్సల్‌ హెల్త్‌ కవరేజ్‌ వంటివి ప్రపంచ ఫార్మసీ కేంద్రంగా భారత్‌ అవతరించడానికి దోహదం చేశాయన్నారు. కొవిడ్‌-19 మహమ్మారి భారత్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ఆరోగ్య సేవలపై ఎంతో ప్రభావాన్ని చూపించిందని తెలిపారు. ముఖ్యంగా భారత్‌లో క్షయ చికిత్స, అసంక్రమిత వ్యాధులు, శిశు ఆరోగ్య సేవలు అందించడంలో తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ప్రజారోగ్య నిపుణులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

దేశంలో వ్యాధులు పెరుగుదలకు చిన్నారుల్లో పోషకాహార లోపం కారణమవుతోందని యునిసెఫ్‌ నివేదికలు పేర్కొంటున్నాయి. ఐదేళ్లలోపు చిన్నారుల్లో మరణాలకు ఇదే ప్రధాన కారణంగా ఉంటోంది. ఈ పరిస్థితులను కరోనా మహమ్మారి మరింత పెంచింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యరంగ నిపుణులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఎదురయ్యే సమస్యలను ముందుగానే అంచనా వేసి.. అత్యవసరమున్న సేవలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇలా సంసిద్ధంగా ఉంటేనే అత్యవసర ఆరోగ్య సేవల విషయంలో ఎలాంటి సవాళ్లు ఎదురైనా రాజీపడకుండా వ్యవహరించవచ్చని అభిప్రాయపడ్డారు.

ఇక యావత్‌ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ.. అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా టీకాలు ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని భారత్‌ గణనీయంగా పెంచుకుంది. అంతేకాకాకుండా కీలక ఔషధాలు కూడా ఇక్కడే తయారవుతున్నాయి. ప్రపంచానికి అవసరమైన ఔషధాలను చాలావరకు భారత్‌ ఎగుమతి చేస్తోంది. ఇలా ఆరోగ్య రంగంలో నూతన ఆవిష్కరణల సత్తాను భారత్‌ చాటిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని