TS News: ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలం: పీయూష్‌ గోయల్‌

తెలంగాణ రైతుల ఉజ్వల భవిష్యత్‌ కోసం ప్రధాని కృషి చేస్తున్నారని కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌

Updated : 21 Dec 2021 15:53 IST

దిల్లీ: తెలంగాణ రైతుల ఉజ్వల భవిష్యత్‌ కోసం ప్రధాని కృషి చేస్తున్నారని కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులను గందరగోళ పరుస్తోందని చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తున్న నేపథ్యంలో దిల్లీలో ఆయన.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర భాజపా నేతలతో కలసి మీడియాతో మాట్లాడారు.

‘‘సీఎం కేసీఆర్‌ అబద్ధాలు చెబుతున్నారు. రబీ సీజనులో ధాన్యం సేకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఉప్పుడు బియ్యాన్ని అదనంగా తీసుకునేందుకు కూడా అంగీకరించాం. అదనంగా 20లక్షల టన్నుల ఉప్పుడు బియ్యాన్ని తీసుకునేందుకు ఒప్పందం జరిగింది. ఈ అవకాశాన్ని కేవలం తెలంగాణకు మాత్రమే ఇచ్చాం. ఒప్పందం ప్రకారం ఇవ్వా్ల్సిన ధాన్యాన్ని తెలంగాణ ఇవ్వలేదు. నాలుగు సార్లు గడువు కూడా పొడిగించాం. దేశంలో ఉప్పుడు బియ్యాన్ని చాలా తక్కువగా తింటారు.

రా రైస్‌ ఎంత ఇచ్చినా తీసుకుంటామని ఏడాది క్రితమే చెప్పాం. ఒప్పందం ప్రకారం ధాన్యాన్ని సేకరించి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కేంద్రంపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రా రైస్‌ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే మొత్తం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని పీయూష్‌ గోయల్‌ అన్నారు.

ప్రతి గింజా కొంటామని కేసీఆర్‌ చెప్పలేదా?: కిషన్‌రెడ్డి

‘‘ తెలంగాణ రాష్ట్రం రా రైస్‌, బాయిల్డ్‌ రైస్‌ కలిపి ఎఫ్‌సీఐకి 27.39లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సరఫరా చేయాలి. ఎఫ్‌సీఐకి ధాన్యం సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. భవిష్యత్‌లో బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది. సీఎం కేసీఆర్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హుజూరాబాద్‌ ఓటమి తర్వాతే కేసీఆర్‌ బియ్యం అంశాన్ని లేవనెత్తారు. మెడపై కత్తి పెట్టి రాయించుకున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం రా రైస్‌ ఎంత వస్తే అంతా కొంటామని గోయల్‌ చెప్పారు. 2022 సీజన్‌ ధాన్యం సేకరణ ప్రారంభం కాబోతోంది. జనవరి నుంచి 31వరకు 40లక్షల టన్నుల ధాన్యం సేకరణకు ఒప్పందం జరిగింది. ప్రతి గింజా కొంటామని కేసీఆర్‌ చెప్పలేదా?రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయింపులు చేసి రైతులను ఆదుకోవాలి. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై లేదా?’’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని