Marriage Age: యువతుల పెళ్లి వయసు పెంపు.. కొందరిని బాధిస్తోంది..!

కొద్ది నెలల్లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ మహిళా ఓటు బ్యాంకుపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలో మంగళవారం జరిగిన సభలో మాట్లాడుతూ.. యువకులతో సమానంగా యువతుల వివాహ వయసును పెంచే దిశగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించారు.

Published : 21 Dec 2021 18:19 IST

ప్రయాగ్‌రాజ్‌: కొద్ది నెలల్లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ మహిళా ఓటు బ్యాంకుపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలో మంగళవారం జరిగిన సభలో మాట్లాడుతూ.. యువకులతో సమానంగా యువతుల వివాహ వయసును పెంచే దిశగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించారు.

 ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రభుత్వ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. ‘కేంద్రం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు యువతుల వివాహ వయస్సు 18 సంవత్సరాలుగా ఉండేది. కానీ బాలికలు తమ చదువు కోసం మరింత సమయం కావాలని కోరుకుంటున్నారు. అందుకే మేం వివాహ వయస్సును 21కి పెంచే ప్రయత్నం చేస్తున్నాం. దీనితో ఎవరు ఇబ్బంది పడుతున్నారో అందరూ చూస్తున్నారు. ఇది కొందరికి బాధ కలిగిస్తోంది’ అంటూ ఏ పార్టీ పేరు చెప్పకుండా ఈ బిల్లును వ్యతిరేకించే పార్టీలపై విమర్శలు చేశారు. తీవ్ర నిరసనల మధ్య వివాహ వయస్సును 18 నుంచి 21కి పెంచే బాల్య వివాహాల నియంత్రణ సవరణ బిల్లు-2021ను కేంద్రం ఈ రోజు లోక్‌సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృతంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగయ్యాయని మోదీ వెల్లడించారు. ‘ఐదేళ్ల క్రితం రాష్ట్రంలో మాఫియా రాజ్యం ఉండేది. దాని వల్ల మహిళలే ఎక్కువగా బాధపడేవారు. మీరు పోలీస్ స్టేషన్లకు వెళ్తే.. రేపిస్టులు, నేరస్థులకు అనుకూలంగా ఫోన్లు వచ్చేవి. ఇప్పుడు ఆ నేరస్థుల ఆటలు సాగడం లేదు. అలాగే మహిళలు ఇళ్లకే పరిమితం కావాలని అనుకోవడం లేదు. తిరిగి మునుపటి పరిస్థితిలోకి వెళ్లాలనుకోవడం లేదు. వారి కోసం పనిచేసే పార్టీ ఏంటో వారికి ఇప్పుడు తెలిసిపోయింది. తమ కోసం పనిచేయని పార్టీలను తిరిగి అధికారంలోకి తీసుకురావొద్దనుకుంటున్నారు’ అంటూ మోదీ మాట్లాడారు. అలాగే మహిళల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన పథకాల గురించి ప్రస్తావించారు. కొన్ని పథకాలకు సంబంధించి నిధులు విడుదల చేశారు. మోదీ పాల్గొన్న ఈ సభకు సుమారు రెండు లక్షల మంది మహిళలు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని