
Shikshak Parv: కాలానికి అనుగుణంగా బోధనా పద్ధతులు మారాల్సిందే..!
శిక్షక్ పర్వ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచన
దిల్లీ: వేగంగా మారుతున్న కాలానికి అనుగుణంగా బోధన-అభ్యసన పద్ధతులను ఎప్పటికప్పుడు నిర్వచించుకోవాల్సి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తద్వారా మన విద్యా రంగాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టుకోగలమని ఉద్ఘాటించారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా జరిగిన ‘శిక్షక్ పర్వ్’ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ, విద్యారంగంలో మార్పులు భవిష్యత్తుకు అవసరమైన విధంగా యువతను తీర్చిదిద్దుకునేందుకు దోహదపడతాయని సూచించారు.
‘మన విద్యారంగాన్ని ప్రపంచ స్థాయికి చేర్చడానికి బోధన-అభ్యసన ప్రక్రియలను ఎప్పటికప్పుడు పునర్నిర్వచించుకోవాలి. వేగంగా మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు నూతన సాంకేతికతలను అలవరచుకోవాలి. ఇలాంటి మార్పుల కోసం దేశం ఉపాధ్యాయులను సిద్ధం చేస్తోంది’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. కొవిడ్ మహమ్మారి విజృంభణ సందర్భంలోనూ మన విద్యావ్యవస్థ సామర్థ్యాలను స్పష్టంగా చూశామని.. ఎన్నో సవాళ్లు ఎదురైనా వాటిని సమర్థంగా పరిష్కరించుకున్నామని గుర్తుచేశారు. అంతకుముందు ఎన్నడూ ఎరుగని ఆన్‌లైన్ క్లాసులు, వీడియో కాల్స్, ఆన్‌లైన్‌లోనే పరీక్షల నిర్వహణ వంటి నూతన పద్ధతుల్లో విద్యా బోధనను కొనసాగించామని చెప్పారు. ఈ సందర్భంగా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ డిక్షనరీ, టాకింగ్ బుక్స్, విద్యాంజలి పోర్టల్ వంటి నూతన సాంకేతికతలను ప్రధాని మోదీ ప్రారంభించారు.
నూతన విద్యా విధానాన్ని (NEP) ప్రస్తావించిన మోదీ, ఇది రూపొందించినప్పటి నుంచి అమలు వరకూ విద్యావేత్తలు, నిపుణులు, ఉపాధ్యాయులు ఎంతో కృషి చేశారని చెప్పారు. అంతేకాకుండా నాణ్యమైన సుస్థిర పాఠశాలలే లక్ష్యంగా శిక్షక్ పర్వ్-2021 ఉద్దేశమని గుర్తుచేశారు. ఇక తాజాగా జరిగిన ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల ప్రతిభను ప్రధాని మోదీ మరోసారి ప్రశంసించారు. వారి మెరుగైన ప్రతిభతో ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలిచారని అభిప్రాయపడ్డారు.