Modi Speaks to Japan PM: జపాన్‌ నూతన ప్రధానితో మోదీ సంభాషణ

జపాన్‌ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఫుమియో కిషిదకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

Published : 08 Oct 2021 23:52 IST

దిల్లీ: జపాన్‌ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఫుమియో కిషిదకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఫుమియో కిషిదతో ఫోన్‌లో మాట్లాడినట్లు  ప్రధాని మోదీ వెల్లడించారు. భారత్‌-జపాన్‌ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయడంతోపాటు అంతర్జాతీయ భాగస్వామ్యం, ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో సహకారాన్ని పెంపొందించుకునేందుకు కిషిదతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అయితే, ఫుమియో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇద్దరు ప్రధానులు నేరుగా ఫోన్‌లో మాట్లాడుకోవడం ఇదే తొలిసారి.

ఇదిలాఉంటే, కిషిద కంటే ముందు జపాన్‌ ప్రధానమంత్రిగా ఉన్న యోషిహిదె సుగా.. బాధ్యతలు చేపట్టి ఏడాది గడవక ముందే పదవి నుంచి తప్పుకున్నారు. అంతేకాకుండా తిరిగి మరోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా లేనని ప్రకటించారు. గడిచిన ఏడాదిలో ప్రజాదరణ కోల్పోయిన నేతగా సుగా.. కొత్త నాయకుడిని ఎన్నుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. దీంతో నూతన ప్రధాని ఎంపిక అనివార్యమైంది. అనంతరం అధికార పార్టీ నాయకుడి ఎంపికలో జపాన్‌ మాజీ విదేశాంగ మంత్రిగా పనిచేసిన పుమియో కిషిద విజయం సాధించారు. ఈ మధ్యే ఆయన జపాన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పుమియో కిషిదతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని