
Puneeth Rajkumar: విధి ఎంత క్రూరమైనది.. ప్రతిభావంతుడైన నటుడిని తీసుకెళ్లిపోయింది: ప్రధాని
ట్విటర్లో ఫొటో షేర్ చేసిన నరేంద్ర మోదీ
దిల్లీ: ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణం పట్ల భారత ఉపరాష్ట్రపతితో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పునీత్‌ది చనిపోయే వయస్సు కాదన్న ప్రధాని మోదీ.. అద్భుతమైన వ్యక్తిత్వం, ఆయన చేసిన సేవలకు గానూ భవిష్యత్ తరాల్లో పునీత్ నిలిచిపోతారని అన్నారు. ఈ సందర్భంగా పునీత్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ.. ఆయనతో దిగిన ఫొటోను ప్రధాని మోదీ ట్విటర్లో షేర్ చేశారు.
‘విశేష ప్రజాదరణ కలిగిన, ప్రతిభావంతమైన నటుడిని విధి మనకు దూరం చేసింది. చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయారు. అద్భుతమైన వ్యక్తిత్వం, ఆయన చేసిన సేవలకు గానూ వచ్చే తరాలు పునీత్‌ను గుర్తుంచుకుంటాయి. పునీత్ రాజ్‌కుమార్ కుటుంబీకులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను.. ఓం శాంతి’ అంటూ ప్రధాని మోదీ ట్విటర్లో సంతాపం తెలియజేశారు.
ఉపరాష్ట్రపతి సంతాపం..
పునీత్ రాజ్‌కుమార్ మరణం పట్ల భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. పునీత్ మరణం కన్నడ సినిమా ప్రపంచానికి తీరని లోటు అని.. ఇలా మనందరినీ విడిచిపెట్టి పోవడం చాలా దురదృష్టకరమన్నారు. ఈ బాధను తట్టుకునే శక్తిని పునీత్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు వెంకయ్య నాయుడు ట్విటర్లో పేర్కొన్నారు.