Uttarakhand: రాష్ట్రంలో 100శాతం అర్హులకు ఒక డోసు పూర్తి..!

కరోనా వైరస్‌ మహమ్మారిపై పోరును సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు భారత్‌ చేపట్టిన వ్యాక్సిన్‌ కార్యక్రమం రుజువు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు.

Published : 18 Oct 2021 23:43 IST

అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ, ఆరోగ్యశాఖ మంత్రి

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారిపై పోరును సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు భారత్‌ చేపట్టిన వ్యాక్సిన్‌ కార్యక్రమం రుజువు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈ బృహత్‌ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనడమే ఎంతో కీలకమని చెప్పారు. ఉత్తరాఖండ్‌లో 18ఏళ్ల వయసు పైబడిన అర్హులందరికీ కనీసం ఒక డోసు టీకా ఇచ్చినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీ చేసిన ట్వీట్‌కు ప్రధాని మోదీ ఇలా స్పందించారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్‌ ప్రజలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.

‘దేవభూమి ప్రజలందరికీ అభినందనలు. కొవిడ్‌పై దేశం చేస్తోన్న పోరులో ఉత్తరాఖండ్‌ ఈ ఘనత సాధించడం ఎంతో ముఖ్యమైనది. మహమ్మారిపై యావత్‌ ప్రపంచం చేస్తోన్న పోరాటంలో భాగంగా భారత్‌ చేపట్టిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమం అత్యంత ప్రభావవంతంగా కొనసాగుతుందని నాకు విశ్వాసం ఉంది. ఇందులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో కీలకం’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ సారథ్యంలో, రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ కనీసం ఒక డోసు అందించాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ అభినందనలు’ అని ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామీ చేసిన ట్వీట్‌కు ప్రధాని మోదీపై విధంగా స్పందించారు.

ఇదిలాఉంటే, అర్హులైన ప్రతిఒక్కరికీ ఒక డోసు వ్యాక్సిన్‌ అందించడం పట్ల ఉత్తరాఖండ్‌ ప్రజలకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ అభినందనలు తెలిపారు. ఎక్కువ పర్వత ప్రాంతాలు, ప్రతికూల వాతావరణం కలిగిన ఉత్తరాఖండ్‌లో వ్యాక్సిన్‌ పంపిణీలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ వీటిని పూర్తిచేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించారు. కొవిన్‌ పోర్టల్‌ ప్రకారం, ఉత్తరాఖండ్‌లో 74లక్షల 34వేల మందికి కనీసం ఒక డోసు వ్యాక్సిన్‌ అందించారు. వారిలో 34లక్షల 83వేల మంది పూర్తి మోతాదులో రెండు డోసుల టీకా తీసుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 98కోట్ల డోసులను అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని