Updated : 15 Aug 2021 16:58 IST

Independence day: ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని మోదీ

దిల్లీ: శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్‌ ప్రబలశక్తిగా ఎదగాలనే సంకల్పం తీసుకోవాలని ప్రధాని ,నరేంద్రమోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలందరి భాగస్వామ్యంతోనే సమృద్ధ భారత నిర్మాణం అవుతుందని చెప్పారు. 75వ స్వాతంత్ర్య అమృత ఉత్సవాల సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధాని ఎగురవేశారు. తొలుత ఎర్రకోట వద్దకు చేరుకున్న మోదీ.. త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఎర్రకోటకు చేరుకునే ముందు రాజ్‌ఘాట్‌లోని జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద ప్రధాని నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోట వద్ద జాతీయ పతకాన్ని ఎగురవేసి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

వైద్యసిబ్బంది పోరాటం అసమానం..

‘‘స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన త్యాగధనులను నేడు దేశం స్మరించుకుంటోంది. దేశ సరిహద్దుల్లో నిరంతరం పహారా కాస్తున్న వీరజవాన్లకు ప్రణామాలు. కరోనాపై వైద్యులు, సిబ్బంది చేసిన పోరాటం అసమానం. ప్రజల ప్రాణాలు కాపాడే వైద్య సిబ్బంది కృషి ఎంత చెప్పినా తక్కువే. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారంతా మనకు స్ఫూర్తి. పతకాలు సాధించిన వారికి దేశం యావత్తూ గౌరవం ప్రకటిస్తోంది. వాళ్లు కేవలం పతకాలే సాధించలేదు.. నవయువతకు స్ఫూర్తిగా నిలిచారు. 

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ భారత్‌లో..

దేశ విభజన గాయం నేటికీ మనల్ని వెంటాడుతూనే ఉంది. ధన, మాన, ప్రాణాలు పోగొట్టుకున్న వారిని చేదు జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. గౌరవప్రద అంత్యక్రియలకు నోచుకోని వారి చేదు జ్ఞాపకాలు కళ్లముందు కదలాడుతున్నాయి. కరోనా మహమ్మారి చుట్టుముట్టినపుడు టీకాల లభ్యతపై అనుమానం తలెత్తింది. భారత్‌ ప్రజలకు టీకాలు దొరుకుతాయా అనే అనుమానం వచ్చింది. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమం భారత్‌లో జరుగుతోంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో మరణాలు.. వ్యాధి సంక్రమణ తక్కువే. సంక్రమణ తక్కువనేది సంతోషించాల్సిన విషయం మాత్రం కాదు. మహమ్మారి కట్టడికి క్రమశిక్షణతో కృషి చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. మన జీవనశైలి, సామాజిక కట్టుబాట్లు మనల్ని కొంతవరకు రక్షించాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 54 కోట్ల మందికి టీకాలు అందించాం. కొవిన్ యాప్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

వచ్చే 25 ఏళ్లలో ప్రతి అడుగూ కీలకమే!

శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్‌ ప్రబలశక్తిగా ఎదగాలనే సంకల్పం తీసుకోవాలి.  75 నుంచి శతాబ్ది ఉత్సవాల మధ్య ఉన్న ఈ 25 ఏళ్ల కాలం అమృత ఘడియలు. ఈ అమృత కాలాన్ని సర్వ సమృద్ధ భారత్‌ నిర్మాణానికి మనం సంకల్పం తీసుకోవాలి. సంకల్పం తీసుకుంటే సరిపోదు.. నిరంతర శ్రమ, పట్టుదల కావాలి. వచ్చే ఈ 25 ఏళ్లను సద్వినియోగం చేసుకునేందుకు ప్రతి అడుగూ కీలకమే. ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా ప్రతి పౌరుడూ సంకల్ప శక్తితో ముందుకు నడవాలి. సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌.. సబ్‌కా విశ్వాస్‌.. ఇవే మన రణ నినాదం కావాలి. పౌరులందరి భాగస్వామ్యంతోనే సమృద్ధ భారతం నిర్మాణం అవుతుంది.

సంక్షేమ పథకాల అమల్లో వివక్ష వద్దు

ఈ ఏడేళ్లలో ఉజ్వల నుంచి ఆయుష్మాన్‌ వరకు అనేక పథకాలు ప్రజల ముంగిటకు చేరాయి.  సంక్షేమ, అభివృద్ధి పథకాలు హక్కుదారులకు వందశాతం చేరేలా చేయాలి. చిన్న వ్యాపారులు, దుకాణదారులు అందరినీ బ్యాంకులతో అనుసంధానం చేయాలి.  ఇంటింటికీ విద్యుత్‌, తాగునీరు ఇంకా సుదూర స్వప్నం కాకూడదు. ప్రతి ఇంటికీ విద్యుత్‌, తాగునీరు అందించడం మనందరి బాధ్యత. వచ్చే రెండేళ్లలో ప్రతి ఇంటికీ నల్లా ద్వారా సురక్షిత తాగునీరు అందించాలి. సంక్షేమ పథకాల అమల్లో ఎలాంటి వివక్షకు తావుండకూడదు. పేదరికానికి కులం, మతం, ప్రాంతం తేడా ఉండదు. ప్రతి పేదవాడు సగర్వంగా నిలబడేలా సహాయ, సహకారాలు అందాలి. సంపూర్ణ వికాసానికి పోషకాహార లోపం అతిపెద్ద అడ్డంకి. ఏ ఒక్కరూ ఈ లోపంతో ఉండకుండా చూడాల్సిన అవసరం ఉంది. రేషన్‌ దుకాణాల్లో పోషకాహార ధాన్యాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. పోషకాహారంతో పాటు వైద్యం కూడా అత్యంత కీలకమైనది. మండల స్థాయి వరకు సంపూర్ణ వైద్య సౌకర్యాలు అందించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి’’ అని మోదీ చెప్పారు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్