PM Modi: కాశీలో మృత్యువు కూడా మంగళమే: మోదీ

యూపీలోని వారణాసిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాశీ విశ్వనాథ్‌ నడవాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కాశీ సుందరీకరణ పనులు, గంగా నదిని కలుపుతూ నిర్మించిన .......

Updated : 13 Dec 2021 16:18 IST

వారణాసి: ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాశీ విశ్వనాథ్‌ నడవాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కాశీ సుందరీకరణ పనులు, గంగా నదిని కలుపుతూనిర్మించిన ఈ కారిడార్‌ని ప్రజలకు అంకితం చేశారు. ₹339 కోట్లతో నిర్మించిన ఈ కారిడార్‌ తొలి దశ పనులు ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ‘‘అందరికీ కాశీ విశ్వనాథుడి ఆశీస్సులు ఉంటాయి. కాశీ విశ్వనాథుడి పాదాలకు నమస్కరిస్తున్నా. ఎన్నో ఏళ్లుగా వేచి చూసిన సమయం ఆసన్నమైంది. కాశీలో అడుగుపెడితే అన్ని బంధాల నుంచి విమక్తి లభిస్తుంది. కాశీలో అడుగు పెట్టగానే అంతరాత్మ మేల్కొంటుంది. కాశీ చరిత్రలో ఇవాళ నూతన అధ్యాయం రచించాం. భారత ప్రాచీనతకు, సంప్రదాయానికీ ఈ కొత్త నడవా ప్రతీక. ఈనాటి కార్యక్రమంతో గంగా నది ప్రసన్నమైంది’’ అన్నారు.

కాశీ.. ప్రేమ పరంపరకు చిరునామా!

‘‘కాశీ విశ్వనాథుడి దర్శనానికి దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. కొందరు వారణాసి అంశాన్ని కూడా రాజకీయం చేశారు. కాశీలో శివుడి ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు. నడవాను ప్రారంభించడం నాకు గర్వకారణం. రాత్రింబవళ్లు కష్టపడిన సీఎం యోగి ఆదిత్యనాథ్‌ బృందాన్ని అభినందిస్తున్నా. కాశీ.. ప్రేమ పరంపరకు చిరునామా. కాశీలో మృత్యువు కూడా మంగళమే. కాశీలో ప్రతీ జీవిలోనూ ఆ విశ్వేశ్వరుడే కనబడతాడు. కరోనా సమయంలోనూ కాశీలో పనులు వేగంగా జరిగాయి. ఇక్కడి నుంచి ఎంతో మంది స్ఫూర్తి పొందారు. మెగా కాశీ విశ్వనాథ్ కారిడార్‌ ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన అందరికీ ధన్యవాదాలు’’  చెప్పారు. 

ఎన్నో సుల్తాన్‌ రాజ్యాలు వచ్చాయి, పోయాయి.. కానీ!

కాశీ నాగరికత, వారసత్వాన్ని ప్రధాని కొనియాడారు. ఎన్నో సుల్తాన్‌ రాజ్యాలు వచ్చాయి.. పోయాయి.. కానీ బెనారస్‌ మాత్రం అలాగే ఉందన్నారు.   ‘‘దురాక్రమణదారులు ఈ నగరంపై దాడి చేశారు.. నాశనం చేసేందుకు ప్రయత్నించారు. ఔరంగజేబు దురాగతాలకు చరిత్రే సాక్షిగా నిలుస్తుంది. కత్తితో నాగరికతను మార్చేందుకు, మతోన్మాదంతో సంస్కృతిని అణిచివేసేందుకు ప్రయత్నించారు. కానీ ఈ నేల మిగతా ప్రపంచానికి విభిన్నమైనది. ఇక్కడ మొఘల్‌ చక్రవర్తి  ఔరంగజేబు వస్తే.. మరాఠా యోధుడు శివాజీ కూడా అవతరించాడు’’ అని అన్నారు.

ఆత్మనిర్భర్‌ భారత్‌, స్వచ్ఛత, నవకల్పనల కోసం ప్రజలంతా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాశీలో అభివృద్ధి కారిడార్‌ని ప్రారంభించిన ప్రధాని.. ఈ పనులు దేశానికి సరికొత్త దిశ భవిష్యత్తును చూపిస్తాయన్నారు. కాశీ పుణ్యక్షేత్రం ప్రాచీన, నవభారత సమ్మేళనమని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు భారీ సంఖ్యలో సాధువులు పాల్గొన్నారు.

Read latest National - International News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని