LK Advani: అడ్వాణీ 94వ పుట్టినరోజు.. వేడుకల్లో ఉపరాష్ట్రపతి, ప్రధాని

మాజీ ఉప ప్రధాని, భాజపా వ్యవస్థాపకుల్లో ఒకరైన లాల్‌ కృష్ణ అడ్వాణీ (LK Advani) తాజాగా 94వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్రతో పాటు సీనియర్‌ మంత్రులు ఎల్‌కే అడ్వాణీకి శుభాకాంక్షలు తెలిపారు.

Updated : 24 Sep 2022 15:36 IST

భాజపా అగ్రనేతను కొనియాడిన పార్టీ సీనియర్‌ నేతలు

దిల్లీ: మాజీ ఉప ప్రధాని, భాజపా వ్యవస్థాపకుల్లో ఒకరైన లాల్‌ కృష్ణ అడ్వాణీ (LK Advani) తాజాగా 94వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు అడ్వాణీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉదయం నేరుగా అడ్వాణీ నివాసానికి వెళ్లిన నేతలు.. పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని ఆయనతో కేక్‌ కట్‌ చేయించారు. అనంతరం పలు విషయాలపై ఆయనతో ముచ్చటించారు.

అంతకుముందు ప్రధాని మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ‘అడ్వాణీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సుదీర్ఘకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నా. ప్రజల సాధికారత, మన సాంస్కృతిక గొప్పతనాన్ని మరింత పెంపొందించేందుకు చేసిన కృషికి గానూ యావత్‌ దేశం ఆయనకు ఎంతగానో రుణపడి ఉంటుంది’ అని ప్రధాని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు.

అడ్వాణీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సేవలను కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కొనియాడారు. ముఖ్యంగా ఆయన ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచి మార్గనిర్దేశం చేసిన విషయాన్ని రాజ్‌నాథ్‌ గుర్తుచేశారు. అత్యంత మేధస్సు, దూరదృష్టి కలిగిన నాయకుల్లో అడ్వాణీ ఒకరని కీర్తించారు. భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని వేడుకుంటున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా అడ్వాణీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భాజపా సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం ఆయన చేసిన కృషిని కొనియాడారు.

భారతీయ జనతా పార్టీని ప్రజల్లోకి తీసుకుపోవడంతో పాటు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించడంలో ఎల్‌కే అడ్వాణీ ఎంతో కృషి చేశారని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశంసించారు. అడ్వాణీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జేపీ నడ్డా.. తొంభై ఏళ్ల వయసు దాటిన అడ్వాణీ కోట్ల మంది పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని