Corona Virus: గాలి వడపోతతో కరోనాకు చెక్‌

గాలి వడపోత ద్వారా ఆసుపత్రుల కొవిడ్‌ వార్డుల్లో వైరస్‌ వ్యాప్తిని సమర్థంగా అడ్డుకోవచ్చని కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు సూచించారు.

Published : 18 Nov 2021 10:14 IST

ఆసుపత్రుల్లో వీటిని అమర్చుకోవాలి
 ‘కేంబ్రిడ్జ్‌’ శాస్త్రవేత్తల సూచన

లండన్‌: గాలి వడపోత ద్వారా ఆసుపత్రుల కొవిడ్‌ వార్డుల్లో వైరస్‌ వ్యాప్తిని సమర్థంగా అడ్డుకోవచ్చని కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు సూచించారు. ఈ మేరకు వారు ఇటీవల పరిశోధన సాగించారు. కరోనా బాధితులు మాట్లాడినా, దగ్గినా, తుమ్మినా, చీదినా వారి ముక్కు, నోటి నుంచి గాలి తుంపర్లు విడుదలవుతాయి. కరోనా వైరస్‌తో కూడిన ఈ ఏరోసోల్స్‌... కొద్దిసేపటి వరకూ గాలిలో ప్రయాణిస్తాయి. ఆ తర్వాత నేలపైనో, వస్తువులపైనో వాలిపోతాయి. ఇలా కరోనా వైరస్‌ వాయు మార్గంలోనూ వ్యాపిస్తుంది. కొవిడ్‌ బాధితులు చికిత్స పొందే వార్డుల్లో ఈ ముప్పు తీవ్రంగా ఉంటుంది. అందుకే కట్టుదిట్టమైన పీపీఈ కిట్లు ధరించిన చాలామంది వైద్యులు కూడా మహమ్మారికి చిక్కక తప్పలేదు.పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు పలు ఆసుపత్రుల కొవిడ్‌ వార్డుల్లో వాయు నమూనాలను సేకరించి, వాటిలో కరోనా వైరస్‌ స్థాయులను నమోదు చేశారు. తర్వాత ఆయా చోట్ల హై-ఎఫిషియన్సీ పార్టిక్యులేట్‌ ఎయిర్‌ (హెచ్‌ఈపీఏ) మెషిన్లను, యూవీ స్టెరిలైజర్లను అమర్చారు.

గాలిలోని అత్యంత సూక్ష్మస్థాయి కణాలను సైతం సమర్థంగా అడ్డుకునే ఈ యంత్రాలను ఏడు రోజులపాటు నిరాటంకంగా వినియోగించారు. ఆ సమయంలో మళ్లీ అక్కడి గాలిని పరీక్షించగా, కరోనా జాడ కనిపించలేదు! దీంతో యంత్రాలను నిలిపివేసి మళ్లీ వాయు నమూనాలను పరీక్షించగా, వైరస్‌తో కూడిన ఏరోసోల్స్‌ ఉన్నట్టు తేలింది.‘‘వాయుశుద్ధి యంత్రాలు... బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్‌లతో కూడిన గాలి తుంపర్లను గణనీయంగా తగ్గిస్తున్నాయి. గాలి పరిశుభ్రంగా ఉన్నచోట, వాయుమార్గంలో వ్యాధులు సంక్రమించే ముప్పు చాలా తక్కువే. అలాగని వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఎయిర్‌ ఫిల్టర్లు మాత్రమే సరిపోవు. మాస్కులు ధరించడం, దూరం పాటించడం, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, వైద్య సిబ్బంది అయితే పీపీఈ కిట్లు ధరించడం వంటి జాగ్రత్తలు కూడా పాటించాలి’’ అని పరిశోధనకర్త ప్రొఫెసర్‌ స్టీఫెన్‌ బేకర్‌ పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని