Vaccine for Children: ప్రాధాన్య క్రమంలోనే చిన్నారులకు టీకా!

ప్రాధాన్యత క్రమంలోనే చిన్నారులకు టీకా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Published : 03 Oct 2021 21:53 IST

కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌కే అరోరా

దిల్లీ: భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ విస్తృతంగా కొనసాగుతోంది. 18ఏళ్ల వయసు పైబడిన వారిలో దాదాపు 69శాతం మందికి కనీసం ఒక డోసు కరోనా వ్యాక్సిన్‌ అందింది. ఇదే సమయంలో త్వరలోనే చిన్నారులకు టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, వారికి టీకా పంపిణీ ఏ విధంగా చేపట్టాలనే విషయంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాధాన్య క్రమంలోనే చిన్నారులకు టీకా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా తీవ్ర ఆరోగ్య సమస్యలున్న చిన్నారులకే తొలి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొంది. ఆ తర్వాత సాధారణ పిల్లలకు వ్యాక్సిన్‌ అందించేందుకు సిద్ధమవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

‘కొవిడ్‌ బారినపడే ప్రమాదమున్న చిన్నారులు, ఒకవేళ వైరస్‌ బారినపడితే ఆస్పత్రిలో చేరాల్సి వచ్చే పిల్లలను గుర్తించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. మరికొన్ని వారాల్లోనే ఈ జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచుతాం. అంతేగాకుండా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇటువంటి పిల్లలు ప్రయాణం చేయనవసరం లేకుండా స్థానికంగానే టీకా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’ అని నేషనల్‌ ఇమ్యూనైజేషన్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ (NTAGI) ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోరా పేర్కొన్నారు.

ఇక 12ఏళ్లకు పైబడిన చిన్నారుల కోసం జైడస్‌ క్యాడిలా రూపొందించిన టీకా అత్యవసర వినియోగానికి డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI) గత నెలలోనే అనుమతి ఇచ్చింది. దీంతో త్వరలోనే ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇదే సమయంలో భారత్‌ బయోటెక్‌ 2ఏళ్లకు పైబడిన చిన్నారుల కోసం రూపొందించిన టీకా క్లినికల్‌ ప్రయోగాల సమాచారాన్ని ఇప్పటికే డీసీజీఐకి అందించింది. వీటి వినియోగంపైనా త్వరలోనే ఓ ప్రకటన రానుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చాక పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. దేశంలో 18ఏళ్లకు కంటే తక్కువ వయసున్న చిన్నారుల సంఖ్య 44 కోట్లు ఉన్నట్లు అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని