Congress: అత్యాచారంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు.. ఖండించిన ప్రియాంక

అత్యాచారం నుంచి తప్పించుకోలేనప్పుడు దాన్ని ఆనందంగా ఆస్వాదించడమే ఉత్తమమంటూ కర్ణాటక కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే కె.ఆర్‌.రమేశ్‌ కుమార్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమయ్యింది.

Published : 17 Dec 2021 22:49 IST

క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే రమేష్‌

బెంగళూరు: అత్యాచారం నుంచి తప్పించుకోలేనప్పుడు దాన్ని ఆనందంగా ఆస్వాదించడమే ఉత్తమమంటూ కర్ణాటక కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే కె.ఆర్‌.రమేశ్‌ కుమార్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పార్లమెంటులోనూ ఈ విషయాన్ని ప్రస్తావించిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యలు సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆయన్ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అదే సమయంలో రాహుల్‌, ప్రియాంకా గాంధీ వంటి కాంగ్రెస్‌ అగ్రనేతలు స్పందించకపోవడాన్ని పలువురు తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంకా గాంధీ స్పందించారు. ఎమ్మెల్యే రమేష్‌ కుమార్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. అత్యాచారం దారుణమైన నేరమన్న ఆమె.. అటువంటి వ్యాఖ్యలను ఎవరూ సమర్థించబోరని పేర్కొన్నారు.

గురువారం అసెంబ్లీ సమావేశంలో చర్చను పొడిగించాలని ఎమ్మెల్యేలు స్పీకర్‌పై ఒత్తిడి చేశారు. వారిని అదుపు చేయడం స్పీకర్‌ విశ్వేశ్వర్‌ హేగ్డే కగేరీకి తలకు మించిన భారంలా అనిపించింది. ‘‘నేనెలాంటి పరిస్థితిలో ఉన్నానంటే.. అన్నింటినీ అస్వాదిస్తూ ‘అవును’, ‘అవును’ అంటూ ఉండాలి. అంతే’’ అని స్పీకర్‌ నవ్వుతూ వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రమేశ్‌ కుమార్‌ స్పందిస్తూ.. ‘‘అత్యాచారం అనివార్యమైనప్పుడు ఆనందంగా దాన్ని ఆస్వాదించాలి అని ఓ సామెత ఉంది. మీరిప్పుడు సరిగా అలాంటి పరిస్థితిలోనే ఉన్నారు’’ అంటూ వ్యాఖ్యానించారు. అత్యాచారాన్ని సమర్థిస్తూ అసెంబ్లీలోనే ఎమ్మెల్యే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యింది. అంతేకాకుండా సొంత పార్టీ నుంచి విమర్శలు మొదలయ్యాయి. దీంతో వెనక్కి తగ్గిన ఎమ్మెల్యే కేఆర్‌ రమేష్‌.. తన వ్యాఖ్యలకు క్షమాపణ కోరారు. అసెంబ్లీలో తాను చేసిన నిర్లక్ష్య వ్యాఖ్యలకు ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెబుతున్నా అంటూ ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని