Farmers: 15 నెలల సుదీర్ఘ నిరసనకు ముగింపు పలికిన రైతన్నలు

ఏడాదికిపైగా దిల్లీ సరిహద్దుల్ని నిరసనలతో హోరెత్తించిన అన్నదాతలు తమ ఆందోళనకు ముగింపు పలుకుతున్నారు. ఈ శనివారం( డిసెంబర్ 11) తమ నిరసనలు ముగించి, ఇంటికి వెళ్లనున్నారు.

Published : 09 Dec 2021 18:44 IST

శనివారం నిరసన వేదికల్ని ఖాళీ చేయనున్నట్లు ప్రకటన

దిల్లీ: ఏడాదికిపైగా దిల్లీ సరిహద్దుల్ని నిరసనలతో హోరెత్తించిన అన్నదాతలు తమ ఆందోళనకు ముగింపు పలుకుతున్నారు. ఈ శనివారం( డిసెంబర్ 11) తమ నిరసనలు ముగించి, ఇంటికి వెళ్లనున్నారు. ‘నిరసన ప్రాంతాల్ని రైతులు డిసెంబర్ 11న ఖాళీ చేస్తారు’ అని రైతు సంఘం నేత దర్శన్ పాల్ సింగ్ తాజాగా వెల్లడించారు. ‘మేం ఈ ఆందోళనను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నాం. దీనికి సంబంధించి జనవరి 15న సమీక్ష నిర్వహిస్తాం. ఒకవేళ ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే.. మా ఆందోళనలను తిరిగి ప్రారంభిస్తాం’ అని అంతకుముందు ఎస్‌కేఎం నేత గుర్నామ్ సింగ్ చారుణి మీడియాకు వెల్లడించారు.

గత ఏడాది కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) చట్టబద్ధత కోసం ఆందోళన ప్రారంభించిన రైతన్నలు.. చివరకు విజయం సాధించారు. ఈ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు గత నెల స్వయానా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. ఆ తర్వాత పార్లమెంట్ శీతకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే సాగు చట్టాల రద్దు బిల్లుకు ఉభయ సభల్లో ఆమోదం లభించింది. అయితే తమ మిగతా డిమాండ్లను కూడా కేంద్రం పరిష్కరించాలంటూ వారు నిరసనలు కొనసాగించారు. ఈ క్రమంలోనే కేంద్రం నుంచి వారికి నిన్న కొన్ని ప్రతిపాదనలు అందాయి. 

ఎస్‌కేఎంకు చెందిన ఐదుగురు సభ్యుల కమిటీకి కేంద్రం ఒక ముసాయిదా ప్రతిపాదనను పంపింది. ఎంఎస్‌పీపై రైతులు లేవనెత్తిన డిమాండ్ పరిష్కరించేందకు ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. ఈ కమిటీలో ప్రభుత్వ అధికారులు, వ్యవసాయ నిపుణులు, ఈ నిరసనకు నాయకత్వం వహించిన రైతు సంఘాల నేతలు ఉంటారని తెలిపింది. రైతులపై పెట్టిన పోలీసు కేసుల్ని ఉపసంహరించుకోవడానికి అంగీకరించింది. అలాగే నిరసనల్లో భాగంగా ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం అందించేందుకు హరియాణా, యూపీ సూత్రప్రాయంగా ఒప్పుకున్నాయని తెలిపింది. పంజాబ్ ఇప్పటికే పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తమ నిరసనలకు ఫలితం దక్కడంతో.. ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు రైతులు విజయోత్సవ ప్రార్థనలు నిర్వహించనున్నారు. అలాగే శనివారం ఉదయం తొమ్మిదింటికి సింఘు, టిక్రీ ప్రాంతాల్లో విజయోత్సవ ర్యాలీని చేపట్టనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని