Bicycle Trip: 67 ఏళ్ల వయసు.. తరగని ఉషస్సు!

వృద్ధులు సాధారణంగా ఏం చేస్తారు? ఏదో మూలన కూర్చుని.. కృష్ణా, రామా అనుకుంటూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మోహిందర్‌ సింగ్‌ భరాజ్‌ విషయంలో...

Updated : 08 Nov 2021 08:59 IST

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఫుణె వృద్ధుడి సైకిల్‌ యాత్ర

ముంబయి: వృద్ధులు సాధారణంగా ఏం చేస్తారు? ఏదో మూలన కూర్చుని.. కృష్ణా, రామా అనుకుంటూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మోహిందర్‌ సింగ్‌ భరాజ్‌ విషయంలో మాత్రం ఇలాంటి అభిప్రాయాలకు తావు లేదు. ఎందుకంటే 67 ఏళ్ల వయసులో ఈ తాతగారు  ‘రేస్‌ అగైనెస్ట్‌ ఏజ్‌’ పేరుతో ఏకంగా కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్‌ యాత్ర చేశారు. మహారాష్ట్రలోని పుణెకు చెందిన ఈయన వృద్ధుల క్లబ్‌లో చేరాలంటూ (సీనియర్‌ సిటిజన్స్‌ క్లబ్‌) వచ్చిన ఆహ్వానాన్ని సైతం నిరాకరించడం విశేషం. మోహిందర్‌ జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్‌ నుంచి సైకిల్‌ యాత్ర ప్రారంభించారు. 3,600 కిలోమీటర్ల దూరాన్ని 12 రోజుల 18 గంటల 57 నిమిషాలసేపు సైకిల్‌పై ప్రయాణించి తమిళనాడులోని కన్యాకుమారికి చేరుకున్నారు. యాత్ర సాగిన రోజుల్లో రోజుకు 10,000 కేలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకున్నానని, అదే సమయంలో తన బృందంలో ఆరుగురు సభ్యులు, మిత్రులు అద్భుతంగా సహకరించారని పెద్దాయన సంతోషంగా చెప్పారు. సగటున రోజుకు 18 గంటలపాటు సైకిల్‌ తొక్కి, 275 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు వెల్లడించారు. సైకిల్‌ యాత్ర కోసం రోజు విడిచి రోజు రెండు గంటలపాటు, శనివారాల్లో ఆరుగంటలపాటు సైకిల్‌ తొక్కానని, మిగిలిన రోజుల్లో జిమ్‌లో కసరత్తులు చేశానని వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని సుదూర సైకిల్‌ యాత్రలు చేపడతానని స్పష్టం చేశారు.

* చిన్ననాటి నుంచి అథ్లెటిక్స్‌ అంటే మోహిందర్‌కు ఆసక్తి. అందులో 100 మీటర్ల పరుగు పందెం అంటే ప్రాణం. వయసు 40 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి మోకాళ్లు దెబ్బతింటాయన్న భయంతో పరుగులో వేగం తగ్గించారు. సైకిల్‌ యాత్రకు ముందు ఐదేళ్ల పాటు మోహిందర్‌ ఎలాంటి పోటీల్లోనూ, యాత్రల్లోనూ పాల్గొనలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని