
Omicron Vs Sputnik: ఒమిక్రాన్‌ను సమర్థంగా ఎదుర్కొంటున్న స్పుత్నిక్..!
వెల్లడించిన రష్యా ఆరోగ్య విభాగం
మాస్కో: విస్తృత వేగంతో వ్యాపిస్తున్నట్లు భావిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్‌పై ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఈ వేరియంట్‌ను దీటుగా ఎదుర్కోకపోవచ్చనే అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ మాత్రం ఒమిక్రాన్‌పై సమర్థంగా పనిచేస్తోందని రష్యా ఆరోగ్యవిభాగం ప్రకటించింది. ఇదే విషయాన్ని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ప్రకటించినట్లు అక్కడి వార్తా సంస్థ వెల్లడించింది.
రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ (RDIF) సహకారంతో అక్కడి గమలేయా ఇనిస్టిట్యూట్ రూపొందించిన స్పుత్నిక్ టీకా ఇప్పటికే చాలా దేశాల్లో విరివిగా వినియోగిస్తున్నారు. కొవిడ్-19ను నిరోధించడంలో దాదాపు 80శాతం సమర్థత కలిగిన ఈ వ్యాక్సిన్, కొత్త వేరియంట్‌పైనా సమర్థంగా పనిచేస్తోందని రష్యా ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. ఇతర వ్యాక్సిన్ల కంటే మూడు నుంచి ఏడు రెట్లు ఉత్తమంగా తమ వ్యాక్సిన్ పనిచేస్తోందని తెలిపింది. ముఖ్యంగా ఎంఆర్ఎన్ఏ సాంకేతికతతో రూపొందించిన వ్యాక్సిన్ల కంటే మెరుగైన ఫలితాలు ఇస్తోందన్న గమలేయా ఇనిస్టిట్యూట్.. బలమైన, ఎక్కువ కాలం టీ కణాల ప్రతిస్పందనలను కలిగివున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా ఒమిక్రాన్ నుంచి తీవ్ర వ్యాధి బారినపడకుండా స్పుత్నిక్ వి దీర్ఘకాలం రక్షణ కల్పిస్తోందని వెల్లడించింది.
బూస్టర్‌గా సింగిల్ డోసు..
ఇక ఒమిక్రాన్‌ను తటస్థీకరించడంలో స్పుత్నిక్ వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తుండగా.. ఈ రక్షణ మరింత పెంచేందుకు సింగిల్ డోసు (Sputnik Light) టీకాను బూస్టర్‌గా ఇవ్వడం వల్ల మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు గమలేయా ఇనిస్టిట్యూట్ పేర్కొంది. స్పుత్నిక్ లైట్‌ను బూస్టర్ డోసుగా పొందిన 100శాతం మందిలో ఒమిక్రాన్‌ను తటస్థీకరించే యాంటీబాడీలు భారీ మోతాదులో ఉత్పత్తి అయ్యాయని స్పష్టం చేసింది. ముఖ్యంగా బూస్టర్ తీసుకున్న 2 లేదా 3 నెలల తర్వాత ఈ ప్రతినిరోధకాలు గణనీయంగా పెరుగుతున్నట్లు పరిశోధనశాలలో జరిగిన అధ్యయన ఫలితాల విశ్లేషణలో తేలినట్లు చెప్పింది.