
Vladimir Putin: డిసెంబర్ 6న.. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన!
కీలక అంశాలపై చర్చించనున్న పుతిన్-మోదీ
దిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ డిసెంబర్ 6న భారత్‌లో పర్యటించనున్నారు. భారత్-రష్యాల వ్యూహాత్మక సంబంధాలను మెరుగుపరచడంలో భాగంగా ప్రతిఏటా జరిగే వార్షిక సదస్సులో పుతిన్ పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ముఖ్యంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, పలు అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించనున్నట్లు భారత విదేశాంగశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
భారత ప్రధాని మోదీ-రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య భేటీకి ముందే ఇరు దేశాల రెండు శాఖలకు చెందిన మంత్రులు సమావేశం కానున్నారు. భారత్, రష్యాకు చెందిన విదేశాంగ, రక్షణ మంత్రులు సమావేశం కానున్నట్లు భారత విదేశాంగశాఖ వెల్లడించింది. ఇక భారత్-రష్యా మధ్య ఇప్పటికే 20సార్లు వార్షిక సదస్సులు జరగగా.. ఇది 21వ సమావేశం. సాధారణంగా ఈ వార్షిక సదస్సు ఒకసారి రష్యాలో జరిగితే మరోసారి భారత్‌లో జరుగుతుంది. అయితే, గతేడాది ఈ సదస్సు భారత్‌లో జరగాల్సి ఉండగా.. కొవిడ్ కారణంగా వాయిదా పడింది. తాజాగా కొవిడ్ ఉద్ధృతి తగ్గడంతో వార్షిక సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 6న భారత్‌కు రానున్నారు. ఇదిలాఉంటే, రష్యా నుంచి ఆధునిక ఏకే-203 తుపాకుల అత్యవసర కొనుగోలుకు ఇరుదేశాల మధ్య ఒప్పందం ఈ మధ్యే కుదిరిన విషయం తెలిసిందే. సాంకేతికత రష్యాదే అయినప్పటికీ వీటిని భారత్‌లోనే తయారు చేసేలా కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.