
Lakhimpur Kheri: లఖింపుర్ ఖేరి ఘటనపై.. రాష్ట్రపతిని కలిసేందుకు కాంగ్రెస్ సిద్ధం!
అనుమతి కోరుతూ రాష్ట్రపతి భవన్‌కు లేఖ
దిల్లీ: లఖింపుర్ ఖేరి ఘటనకు సంబంధించిన వాస్తవాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వివరించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని ఏడుగురు సభ్యుల బృందం రాష్ట్రపతిని కలవనున్నట్లు తెలిపింది. ఇందుకోసం అనుమతి కోరుతూ రాష్ట్రపతి భవన్ తాజాగా లేఖ రాసింది. ఈ బృందంలో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకా గాంధీ వాద్రా, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఏకే ఆంటోని, మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, గులాం నబీ ఆజాద్, అధీర్ రంజన్ ఛౌదురి రాష్ట్రపతిని కలువనున్నారు.
‘లఖింపుర్ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో నలుగురు రైతులతో సహా మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు కారణమంటూ రైతులు, ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. ఆశిష్ మిశ్రతోపాటు ఆయన అనుచరులు స్వయంగా వాహనం నడుపుకుంటూ తమపైకి దూసుకొచ్చినట్లు రైతులు చెబుతున్నారు. అయినప్పటికీ నిందితులతోపాటు కేంద్ర మంత్రిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు’ అని రాష్ట్రపతి భవన్‌కు రాసిన లేఖలో కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఈ నేపథ్యంలో లఖింపుర్ హింసకు సంబంధించిన వాస్తవాలతో కూడిన పూర్తి సమాచారాన్ని రాష్ట్రపతి ముందుంచేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతి భవన్‌ను కోరింది. ఇక ఈ కేసులో భాగంగా కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రను సుదీర్ఘంగా విచారించిన యూపీ పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. తాజాగా ఆయనను కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
రాజకీయం చేయొద్దు : వరుణ్ గాంధీ
ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న లఖింపుర్ ఖేరి ఘటనను రెండు వర్గాల మధ్య యుద్ధంగా మార్చే ప్రయత్నం జరుగుతోందంటూ భాజపా ఎంపీ వరుణ్ గాంధీ పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు కథనాలు అనైతికమైనవి, అత్యంత ప్రమాదకరమైనవి అన్నారు. జాతీయ సమైక్యతను ప్రమాదంలో నెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకునే ప్రయత్నాలు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని హితవు పలికారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.