Rahul Gandhi: ట్రాక్టర్‌ నడుపుతూ పార్లమెంట్‌కు రాహుల్‌

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకు హాజరయ్యేందుకు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ ట్రాక్టర్‌పై వచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ

Updated : 26 Jul 2021 12:33 IST

దిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకు హాజరయ్యేందుకు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ ట్రాక్టర్‌పై వచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో గత కొన్ని నెలలుగా రైతన్నలు ఉద్యమం సాగిస్తున్న విషయం తెలిసిందే. వారికి మద్దతుగా రాహుల్‌ నేడు స్వయంగా ట్రాక్టర్‌ నడుపుతూ పార్లమెంట్‌కు చేరుకున్నారు. కొత్త సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ‘‘రైతుల సందేశాన్ని నేను పార్లమెంట్‌కు తీసుకొస్తున్నాను. అన్నదాతల గళాన్ని ఈ ప్రభుత్వం అణచివేస్తోంది. దీనిపై పార్లమెంట్‌లో చర్చకు కూడా అనుమతినివ్వట్లేదు. కొత్త సాగు చట్టాలు కేవలం ఇద్దరు ముగ్గురు వ్యాపారవేత్తల కోసం మాత్రమే అని యావత్‌ దేశమంతా తెలుసు. రైతులకు ఉపయోగం లేని ఈ చట్టాలను కేంద్రం వెంటనే ఉపసంహరించాలి’’ అని రాహుల్ ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.

ఈ నెల 19న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే వీటికి ఒకరోజు ముందే పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్‌ అంటూ సంచలన కథనం ప్రకంపనలు సృష్టించింది. దీంతో ఈ వ్యవహారం పార్లమెంట్‌ ఉభయ సభలను కుదిపేసింది. గతవారం ఐదు రోజుల పాటు సమావేశాలు సాగగా.. ప్రతిపక్షాల ఆందోళనలతో ఎలాంటి చర్చలకు వీలుపడలేదు. పెగాసస్‌తో పాటు సాగు చట్టాలు, కరోనా అంశాలపై విపక్షాలు సభల్లో నిరసన చేపట్టాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని