CBSE Controversy: సీబీఎస్‌ఈ ప్రశ్నాపత్రం వివాదం.. ప్రభుత్వం క్షమాపణ చెప్పాల్సిందే!

సీబీఎస్‌ఈ పదోతరగతి పరీక్షల్లో భాగంగా ఇంగ్లీష్‌ పేపర్లో ఇచ్చిన ఓ పేరా ప్రస్తుతం వివాదాస్పదమయ్యింది. దీనిపై ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతుండగా.. తాజాగా కాంగ్రెస్‌ అగ్రనేతలు దానిపై మండిపడ్డారు.

Updated : 13 Dec 2021 15:44 IST

కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ సోనియా, రాహుల్‌

దిల్లీ: సీబీఎస్‌ఈ పదోతరగతి పరీక్షల్లో భాగంగా ఇంగ్లీష్‌ పేపర్లో ఇచ్చిన ఓ పేరా ప్రస్తుతం వివాదాస్పదమయ్యింది. దీనిపై ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతుండగా.. తాజాగా కాంగ్రెస్‌ అగ్రనేతలు దానిపై మండిపడ్డారు. ఇంగ్లీష్‌ పేపర్‌ చాలా అసహ్యంగా ఉందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌-భాజపా పన్నాగంలోనే భాగమేనని ఆరోపించిన ఆయన.. యువత మనోధైర్యాన్ని, భవిష్యత్తును నాశనం చేసే ప్రయత్నమేనని దుయ్యబట్టారు. ఇక ఇదే అంశాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ లోక్‌సభలోనూ లేవనెత్తారు. దీనిపై మోదీ ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

‘ఇప్పటివరకు సీబీఎస్‌ఈ పేపర్లన్నీ కఠినంగానే ఉన్నాయి. ఇక ఇంగ్లీష్‌ పేపర్‌లో ఇచ్చిన కాంప్రెహెన్షన్‌ పాసేజ్‌ చాలా అసహ్యంగా ఉంది. యువత మనోధైర్యాన్ని, భవిష్యత్తును దెబ్బతీసే ఇటువంటి చర్య ఆర్‌ఎస్‌ఎస్‌-భాజపా ప్రయత్నాల్లో భాగమే’ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. పిల్లలూ మీ వంతు కృషి చేయండి. కష్టపడితే మంచి ఫలితం ఉంటుంది అని పేర్కొన్నారు. మరోవైపు సీబీఎస్‌ఈ ప్రశ్నాపత్రంలో వివాదాస్పదమైన అంశాన్ని చేర్చడం పట్ల కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంకాగాంధీ వాద్రా కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం క్షమాపణ చెప్పాల్సిందే: సోనియా

మహిళలను విద్వేషించే విధంగా ఉన్న పేరాను సీబీఎస్‌ఈ ప్రశ్నాపత్రంలో ఇవ్వడాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రంగా ఖండించారు. దీనిపై మోదీ ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశాన్ని లోక్‌సభలో జీరో అవర్‌లో లేవనెత్తిన సోనియా గాంధీ.. ఈ అభ్యంతరకరమైన ప్రశ్నను వెంటనే ఉపసంహరించుకోవడంతో పాటు దీనికిగల కారణాలపై సమీక్ష నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

ఇదిలాఉంటే, శనివారం జరిగిన సీబీఎస్‌ఈ పదోతరగతి ఇంగ్లీష్‌ పరీక్ష ప్రశ్నాపత్రంలో ‘మహిళలను తక్కువ చేసి చూడడం, భర్త మార్గాన్ని అనుసరించడం ద్వారానే తల్లి తన పిల్లల విధేయతను పొందగలదు’ అనే అర్థం వచ్చే వాక్యాలు ఓ పేరాలో ఉండడం తాజా వివాదానికి కారణమయ్యింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని