India Changing Strategy: అఫ్గాన్‌లో మారుతున్న సమీకరణాలు భారత్‌కు సవాలే..!

అఫ్గానిస్థాన్‌లో వేగంగా మారుతున్న సమీకరణాలు భారత్‌కు సవాలేనని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అక్కడి తాజా పరిణామాలతో ప్రభుత్వం కూడా తన వ్యూహాన్ని పునరాలోచించుకోవాల్సి వచ్చిందని అభిప్రాయపడింది.

Published : 29 Aug 2021 14:22 IST

వ్యూహాలను మార్చుకుంటున్నామన్న రక్షణశాఖ

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లో వేగంగా మారుతున్న సమీకరణాలు భారత్‌కు సవాలేనని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అక్కడ నెలకొన్న పరిణామాలతో ప్రభుత్వం కూడా తన వ్యూహాన్ని పునరాలోచించుకోవాల్సి వచ్చిందని అభిప్రాయపడింది. తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత అఫ్గాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోవడంతో పాటు జంటపేలుళ్ల అనంతరం అక్కడ నెలకొన్న భయానక వాతావరణం దృష్ట్యా అక్కడి పరిస్థితులను భారత్‌ నిశితంగా గమనిస్తోంది.

‘అఫ్గానిస్థాన్‌లో వేగంగా మారుతున్న సమీకరణాలు మనకు సవాలే. ఈ నేపథ్యంలో మన వ్యూహాన్ని పునరాలోచించుకోవాల్సి వచ్చింది. మనం వ్యూహాలను మార్చుకొన్నాము. ఈ మార్పులకు అనుగుణంగానే క్వాడ్‌ (QUAD) కూడా ఏర్పడింది’ అని భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇంటిగ్రేటెడ్‌ బ్యాటిల్‌ గ్రూప్‌(ఐబీజీ)ల ఏర్పాటును రక్షణశాఖ ఆలోచిస్తుందనన్నారు. యుద్ధ సమయంలో అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ బృందాలు సత్వర నిర్ణయాలను సులభతరం చేయడమే కాకుండా యుద్ధ బృందాల సంఖ్యను కూడా పెంచుతాయని రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు.

ఇదిలాఉంటే, అఫ్గానిస్థాన్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై మిత్ర దేశాలతో భారత్‌ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. ఇందులో భాగంగా అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్‌తో భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఇప్పటికే చర్చలు జరిపారు. అక్కడి పరిస్థితులను ఎదుర్కొనే వ్యూహాలపైనా ఇరువురు తమ ఆలోచనలను పంచుకున్నట్లు కేంద్రమంత్రి జైశంకర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇక కాబుల్‌ విమానాశ్రయం వద్ద జంటపేలుళ్ల ఘటనను తీవ్రంగా పరిగణించిన భారత్‌..  ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతోంది. ఈ నేపథ్యంలో తన వ్యూహాలను కూడా ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నట్లు వెల్లడిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని