Rakesh Asthana: ప్రజా ప్రయోజనాల దృష్ట్యానే ‘ఆస్థానా’ నియామకం!

ప్రజా ప్రయోజనాల కోసమే ఐపీఎస్‌ ఆఫీసర్‌ రాకేశ్‌ ఆస్థానాను దిల్లీ పోలీస్‌ కమిషనర్‌గా నియమించినట్లు కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.

Published : 16 Sep 2021 18:48 IST

దిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌

దిల్లీ: ప్రజా ప్రయోజనాల కోసమే ఐపీఎస్‌ ఆఫీసర్‌ రాకేశ్‌ ఆస్థానాను దిల్లీ పోలీస్‌ కమిషనర్‌గా నియమించినట్లు కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ముఖ్యంగా దేశ రాజధానిలో ఎదురయ్యే శాంతిభద్రత సవాళ్లు, వివాదాలను దృష్టిలో ఉంచుకొనే ఆయనను నియమించినట్లు పేర్కొంది. దిల్లీ కమిషనర్‌గా రాకేశ్‌ ఆస్థానా నియామకాన్ని సమర్థిస్తూ దిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తాజాగా అఫిడవిట్‌ దాఖలు చేసింది.

‘భిన్న రాజకీయ, శాంతిభద్రతలు సమస్యలను ఎదుర్కోవడంలో అనుభవంతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థల పర్యవేక్షణ, పారామిలటరీ బలగాల్లో పనిచేసిన అనుభవాన్ని పరిగణలోకి తీసుకున్నాం. దిల్లీ పోలీస్‌ విభాగానికి అధిపతిగా విస్తృత అనుభవం కలిగిన సమర్థమైన అధికారి అవసరమని భావిస్తున్నాం’ అని కేంద్ర హోంశాఖ కార్యదర్శి దిల్లీ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. అంతేకాకుండా ఆస్థానా నియామకం విషయంలో ఎటువంటి తప్పులు జరగలేదని.. నియమ, నిబంధనల ప్రకారమే దిల్లీ పోలీస్‌ కమిషనర్‌గా నియమించినట్లు తెలిపారు. ఇంటర్‌-కేడర్‌ డిప్యూటేషన్‌కు అనుమతి ఇవ్వడంతో పాటు సర్వీసును పొడగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి స్పందనగా కేంద్రం ఈ అఫిడవిట్‌ను దాఖలు చేసింది.

ఇక రాకేశ్‌ ఆస్థానా పదవీ కాలం జులై 31తో పూర్తికావడానికి కేవలం మూడు రోజుల ముందే ఆయన్ను దిల్లీ పోలీస్‌ కమిషనర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులోనూ పిటిషన్‌ దాఖలు అయ్యింది. అంతేకాకుండా సుప్రీం కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా రాకేశ్‌ ఆస్థానా నియామకం జరిగినట్లు భావిస్తున్నామని దిల్లీ ప్రభుత్వం కూడా పేర్కొంది. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర హోంశాఖను డిమాండ్‌ చేయడంతో పాటు అసెంబ్లీ తీర్మానం కూడా చేసింది. అయినప్పటికీ దిల్లీ పోలీస్‌ కమిషనర్‌గా ఆస్థానా నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని